మెక్సికో-అమెరికా సరిహద్దుల్లో అమర్చిన కెమెరా ట్రాప్లో రికార్డైన ఓ వింత జీవి దృశ్యాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మెక్సికోలోని రియో గ్రాండే నది పరివాహక ప్రాంతమైన జువారేజ్ లోయలో ఈ వింత ప్రాణి సంచరిస్తున్నట్లు యూఎఫ్వో పరిశోధకుడు జైమ్ మౌసన్ వెల్లడించారు. గతంలో మెక్సికో పార్లమెంట్ ఎదుట ఏలియన్ మమ్మీలను ప్రదర్శించి సంచలనం సృష్టించిన మౌసన్ బృందం.. అక్టోబర్ 17న విడుదల చేసిన ఫొటోల్లో పొడవైన తోక, విలక్షణమైన అవయవాలతో పాలిపోయిన రంగులో ఉన్న ఈ ప్రాణి భూమిపై సాధారణంగా కనిపించే ఏ జంతువుతోనూ పోలిక లేని ఒక తెలియని వేటాడే జీవి కావచ్చని పేర్కొంది.
స్థానిక వ్యవసాయ క్షేత్రాల్లో కోళ్లు, కుందేళ్లను ఎత్తుకెళ్తున్న ఈ జీవి దాదాపు 3 అడుగుల తోకతో కలిపి మొత్తం 6 అడుగుల పొడవు ఉన్నట్లు పరిశోధక బృందం ప్రాథమికంగా అంచనా వేసింది. కెమెరా ఫుటేజీలో ఇది నేలపై చురుగ్గా కదలడం, అలవోకగా గోడలు ఎక్కడం వంటి దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ప్రాణి అత్యంత తెలివైందని, కొన్ని మానవ లక్షణాలు కూడా కలిగి ఉందని తెలిపిన మౌసన్.. ఓ కోడిని నోట కరుచుకుని చెట్టు ఎక్కుతుండగా స్థానిక బాలుడు చూసిన సమాచారంతోనే తాము విస్తృత పరిశోధనలు ప్రారంభించినట్లు స్పష్టం చేశారు.
ఈ వింత ప్రాణి అంతరిక్షం నుంచి వచ్చిన గ్రహాంతరవాసి (ఏలియన్) కాకపోవచ్చని, ఇతర డైమెన్షన్లు లేదా సమాంతర లోకాలకు (Parallel Dimensions) చెందిన తెలివైన జీవి కావచ్చని మౌసన్ అభిప్రాయపడుతున్నారు. అయితే గతంలో మౌసన్ తీసుకొచ్చిన ఏలియన్ మమ్మీలపై పలు విమర్శలు రావడం, గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లభించలేదని అమెరికా అధికారులు గతంలో స్పష్టం చేయడంతో ఈ సరికొత్త ఆవిష్కరణపై సర్వత్రా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ ఈ జీవి ఆకారానికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారి అంతుచిక్కని మిస్టరీగా నిలిచాయి.
Post Views: 1









