ఢిల్లీ హైకోర్టు జడ్జిని బహిష్కరించిన కేజ్రీవాల్, సిసోడియా.. మద్యం పాలసీ కేసులో సంచలనం

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకు ప్రత్యేక కోర్టు ఇచ్చిన క్లీన్ చిట్‌ను సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. అయితే, ఈ కేసు విచారణ నుంచి న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మను తప్పించాలంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తీవ్రంగా తోసిపుచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో, ఆమె ధర్మాసనం ఎదుట విచారణకు తాము కానీ, తమ లాయర్లు కానీ హాజరుకాబోమని కేజ్రీవాల్ మరియు సిసోడియా కోర్టును బహిష్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ.. న్యాయమూర్తిపై ఆయన చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని, కేవలం ఊహాగానాలేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ శర్మ పిల్లలు కేంద్ర ప్రభుత్వ లీగల్ ప్యానెల్‌లో ఉన్నారన్న సాకుతోనో, లేదా ఆమె ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నారన్న అనుమానాలతోనో పక్షపాతాన్ని ఆపాదించలేమని పేర్కొంది. స్పష్టమైన ఆధారాలు లేకుండా న్యాయమూర్తులపై ఇలాంటి వ్యక్తిగత అనుమానాలు వ్యక్తం చేయడం న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని, సంస్థాగత విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీస్తుందని కోర్టు హెచ్చరించింది.

మరోవైపు, జస్టిస్ శర్మ ధర్మాసనం నుంచి తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని, అందుకే మహాత్మా గాంధీ సూత్రాలను పాటిస్తూ తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆప్ నేతలు వెల్లడించారు. తీర్పులు అనుకూలంగా రాకపోతే పైకోర్టుకు వెళ్లాలి తప్ప, అనుకూలమైన జడ్జిల కోసం అభ్యర్థించడం చట్టబద్ధం కాదని కోర్టు స్పష్టం చేసింది. కాగా, ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. న్యాయవ్యవస్థపై కేజ్రీవాల్ ఒత్తిడి తెస్తున్నారని బీజేపీ ఆరోపిస్తుండగా, తమకు కావాలనే అన్యాయం జరుగుతోందని ఆప్ నేతలు వాదిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు