ఫ్యూచర్ సిటీలో నూతన పోలీసు కమిషనరేట్ (సీపీ) భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తున్న ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలపై ఆయన తనదైన శైలిలో సెటైర్లు వేశారు. శుక్రాచార్యుడు ఫాంహౌస్‌లో పడుకుంటే, మారీచుడు, సుబాహుడు జనంలో తిరుగుతున్నారని పరోక్షంగా విమర్శించారు. విపక్షాలు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఏడుస్తున్నారని, వాళ్లు ఏడుస్తూనే ఉంటారని, తాను మాత్రం తన పని చేసుకుంటూ పోతానని సీఎం తేల్చి చెప్పారు.
ఫ్యూచర్ సిటీని టోక్యో, సియోల్, సింగపూర్ వంటి అంతర్జాతీయ నగరాలతో పోటీ పడేలా ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే వేగంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, జూన్ 2 నాటికి సీపీ భవనాన్ని పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే ఐటీ, ఫార్మా, డిఫెన్స్ రంగాల్లో హైదరాబాద్ అద్భుతమైన ప్రగతి సాధించిందని, కరోనా విపత్కర సమయంలో జీనోమ్ వ్యాలీ ప్రపంచానికే వ్యాక్సిన్ అందించిందని గుర్తుచేశారు. మున్ముందు నగరానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ బృహత్తర ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చి సహకరించాలని రైతులకు సీఎం విజ్ఞప్తి చేశారు. భూములు కోల్పోయే ప్రతి ఒక్కరికీ కచ్చితంగా తగిన పరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రవాణా కనెక్టివిటీ గురించి ప్రస్తావిస్తూ.. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేతో బెంగళూరు దూరం తగ్గుతుందని తెలిపారు. అంతేకాకుండా కేంద్రం ప్రవేశపెట్టనున్న ఏడు హైస్పీడ్ (బుల్లెట్) రైళ్లలో మూడు కారిడార్లు (బెంగళూరు-హైదరాబాద్, శంషాబాద్-ముంబై, శంషాబాద్-చెన్నై) మన రాష్ట్రం మీదుగానే వెళ్లనున్నాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు.









