విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న డేటా సెంటర్ ప్రాజెక్టు క్రెడిట్ అంతా గత వైసీపీ ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. వైఎస్ జగన్ హయాంలోనే అదానీ గ్రూప్‌కు 130 ఎకరాల భూమిని కేటాయించామని, 2021 నుంచే విశాఖను డేటా సెంటర్ హబ్‌గా మార్చేందుకు పునాదులు వేశామని ఆయన గుర్తుచేశారు. గూగుల్ సంస్థ విశాఖకు రావడానికి నాడు తాము సింగపూర్ ప్రభుత్వానికి రాసిన లేఖలు, సబ్‌సీ కేబుల్ కనెక్టివిటీ కోసం చేసిన ప్రయత్నాలే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టు అమలు తీరుపై అమర్నాథ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం డేటా సెంటర్‌కు సుమారు రూ. 22 వేల కోట్ల భారీ రాయితీలు ఇస్తున్నప్పటికీ, కేవలం 200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయని ఒప్పందంలో ఉండటం దారుణమన్నారు. లక్షా 80 వేల ఉద్యోగాలు వస్తాయని ఆశపెట్టి నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గూగుల్ ద్వారా ఒక పూర్తిస్థాయి డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, భారీగా రాయితీలు ఇస్తున్నప్పుడు ఉద్యోగాల కల్పనపై గట్టి హామీ ఎందుకు తీసుకోలేదని ఆయన విమర్శించారు.
డేటా సెంటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ఆయన పలు సాంకేతిక సందేహాలు లేవనెత్తారు. నిరంతరం అవసరమయ్యే భారీ విద్యుత్, నీటి సరఫరాను ఈ ప్రభుత్వం ఎలా సమకూరుస్తుందని ఆయన నిలదీశారు. పైప్‌లైన్ కనెక్టివిటీ లేకపోవడం, పోలవరం నుంచి నీటిని తరలించడంలో ఉన్న ఎత్తు సంబంధిత సమస్యల దృష్ట్యా కేవలం రెండు నెలల్లో గోదావరి జలాలను విశాఖకు తీసుకురావడం అసాధ్యమన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఇంధన కొరతను ప్రస్తావిస్తూ, కూటమి ప్రభుత్వ పరిపాలనలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అమర్నాథ్ ఎద్దేవా చేశారు.









