సూర్య ‘కరుప్పు’ విడుదలకు బ్రేక్: థియేటర్ల వద్ద అభిమానుల నిరాశ.. సాయంత్రం 6 గంటలకే సినిమా అంటూ డైరెక్టర్ ఎమోషనల్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘కరుప్పు’ విడుదలకు ఊహించని అడ్డంకులు ఎదురయ్యాయి. మే 14న (గురువారం) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా మార్నింగ్ షోలు రద్దు కావడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. కేవలం తమిళనాడులోనే కాకుండా అమెరికా వంటి ఓవర్సీస్ మార్కెట్లలో కూడా షోలు క్యాన్సిల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు ఆర్జే బాలాజీ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ వీడియోను విడుదల చేస్తూ, ఎదురవుతున్న ఇబ్బందులకు ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు.

ఈ విడుదల జాప్యానికి ప్రధాన కారణం గత సినిమాలకు సంబంధించిన ఫైనాన్షియల్ ఇష్యూస్ అని కోలీవుడ్ వర్గాల సమాచారం. దాదాపు ₹50 కోట్ల వరకు బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో ఫైనాన్షియర్లు క్లియరెన్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాతలు ఈ సమస్యలను పరిష్కరించే పనిలో ఉన్నారని, సాయంత్రం 6 గంటల షో నాటికి సినిమా ఖచ్చితంగా థియేటర్లలోకి వస్తుందని ఆర్జే బాలాజీ ధీమా వ్యక్తం చేశారు. 32 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వస్తున్న ఈ సినిమాపై ఆయన పూర్తి నమ్మకంతో ఉన్నారు.

సూర్య సరసన త్రిష కథానాయికగా నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విడుదలవుతున్న మొదటి పెద్ద సినిమా ఇదే కావడం విశేషం. అంతేకాకుండా, ప్రభుత్వం ఉదయం 9 గంటల షోలకు ప్రత్యేక అనుమతి ఇచ్చినప్పటికీ, ఆర్థిక కారణాల వల్ల మొదటి షో పడకపోవడం గమనార్హం. ప్రస్తుతం చర్చలు తుది దశకు చేరుకున్నాయని, సాయంత్రం లోపు అన్ని అడ్డంకులు తొలిగి ‘కరుప్పు’ విజయవంతంగా విడుదలవుతుందని చిత్ర యూనిట్ ఆశిస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు