పవన్‌ను అడ్డుకోవడం అప్రజాస్వామికం: సీఎం చంద్రబాబు ఫైర్

హైదరాబాద్‌లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరించడం మరియు తెలంగాణ నేతలు ఆయనపై చేస్తున్న విమర్శలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీకైనా, నాయకుడికైనా దేశంలో ఎక్కడైనా పర్యటించి తమ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే హక్కు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ కార్యక్రమాలను ప్రాంతం పేరుతో అడ్డుకోవాలని చూడటం ముమ్మాటికీ అప్రజాస్వామికమని బాబు మండిపడ్డారు.

భారతదేశంలోని ఫెడరల్ స్ఫూర్తిని గుర్తు చేస్తూ, గతంలో తమిళనాడు ఎన్నికల్లో తాను ప్రచారం చేశానని, అలాగే కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కూడా ఇతర రాష్ట్రాల్లో యాక్టివ్‌గా తిరిగారని చంద్రబాబు ఉదాహరించారు. ఒకే దేశంలో ఉన్నప్పుడు ఒక రాష్ట్ర నేత పక్క రాష్ట్రానికి వెళ్లకూడదనే నిబంధన ఎక్కడా లేదని తెలంగాణ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో ఉన్నవారు ప్రజలకు ఎవరు ఎక్కువ సేవ చేస్తారనే విషయంలో పోటీ పడాలే తప్ప, విద్వేషాలు రగల్చడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 12 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా ఇంకా పాత ఆంధ్రా-తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేయడంపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం, పబ్లిసిటీ కోసం ఇలాంటి ఇరుకైన రాజకీయాలు చేయడం ఎవరికీ మంచిది కాదన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఎవరి పాత్ర ఎంత ఉందో తెలంగాణ చైతన్యవంతమైన సమాజానికి బాగా తెలుసని, రాజకీయాల కోసం పాత వివాదాలను తవ్వి తీయడం నాయకుల బలహీనతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు