తెలంగాణకు వర్ష సూచన: 18 జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసిన వాతావరణ శాఖ!

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణ ప్రాంతాలపై ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, హనుమకొండతో పాటు మొత్తం 18 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ కేంద్రం అధికారులు ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించారు.

ఈ భారీ వర్షాలతో పాటు గంటకు బలమైన ఈదురు గాలులు వీస్తాయని, అలాగే ఉరుములు, మెరుపులు సంభవించే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరోవైపు, దేశవ్యాప్తంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు రేపటిలోగా కేరళ, తమిళనాడు తీరాలను తాకనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ రుతుపవనాల రాక ముంగిట వాతావరణంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో, నిన్న రాత్రి నుంచే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి.

ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మంగళవారం రాత్రంతా ఎడతెరిపి లేకుండా వాన కురిసింది. రాబోయే రెండు రోజులు మరిన్ని భారీ వర్షాల సూచన ఉన్నందున, ప్రజలు అనవసరంగా బయటకు రాకూడదని అధికారులు కోరారు. ముఖ్యంగా చేతికి వచ్చిన పంటలను కాపాడుకునేలా రైతులు, అలాగే గ్రామీణ ప్రాంతాల ప్రజలు లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు