పోలీస్ స్టేషన్‌లో తుపాకీ ఎందుకిచ్చావో మర్చిపోయావా పవన్ కళ్యాణ్?: వైసీపీ నేత పేర్ని నాని కౌంటర్

హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంపై చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని గట్టి కౌంటర్ ఇచ్చారు. వైఎస్ఆర్ హయాంలో రోడ్డుపైకి రావాలంటేనే భయపడేవారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను ఆయన పూర్తిగా ఖండించారు. నాడు పవన్ కళ్యాణ్ తన తుపాకీని పోలీసులకు ఎందుకు అప్పగించాల్సి వచ్చిందో అసలు కథను వివరిస్తూ ఘాటుగా విమర్శలు గుప్పించారు.

“గతంలో నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎదిరించాను, రోడ్డు మీద బయటకు వస్తే కాల్చేసే రోజులవి, అందుకే నా తుపాకీని పోలీస్ స్టేషన్‌లో సరెండర్ చేశాను” అంటూ పవన్ కళ్యాణ్ సొల్లు కబుర్లు చెప్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ తుపాకీ పోలీస్ స్టేషన్‌లో ఇవ్వడానికి అసలు కారణం వైఎస్ఆర్ భయం కాదు అని.. “మీ అమ్మాయి (పవన్ భార్య) తన బాబాయ్ పెద్ద రౌడీ అని, తుపాకీతో కాల్చేస్తాడంటూ తనకు ప్రాణ హాని ఉందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం వల్లే” అని గుర్తు చేశారు. పోలీసులు హెచ్చరించడంతోనే భయపడి పోజుగా వెళ్లి తుపాకీ అప్పగించారని సెటైర్లు వేశారు.

వైఎస్ఆర్ హయాంలో కేవలం పసిపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన దుర్మార్గులనే రోడ్డుపై కాల్చి చంపారని పేర్ని నాని స్పష్టం చేశారు. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు శాంతిభద్రతల సమస్య వస్తుందని మీటింగ్ ఆపితే ఎగిరెగిరి పడిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు హైదరాబాద్‌ ఆస్తులను కాపాడుకోవడానికే అక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్‌లపై మర్యాదగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై, చంద్రబాబు, లోకేష్ అమరావతిలో చేస్తున్న అవినీతిపై పవన్ కళ్యాణ్ నిజాయితీగా ప్రశ్నించాలని పేర్ని నాని సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు