పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో అంతర్గత సంక్షోభం మరింత ముదిరింది. మొన్నటివరకు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తురాలిగా ఉంటూ, ఆమెను ప్రధానిని చేయాలని నినదించిన యువ ఎంపీ సాయోని ఘోష్ అనూహ్యంగా రెబల్స్ వర్గంలో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 15 ఏళ్ల తర్వాత బీజేపీ చేతిలో టీఎంసీ ఓడిపోవడంతో పార్టీ నాయకత్వంపై, ముఖ్యంగా మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే సీనియర్ ఎంపీ కాకోలీ ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో సుమారు 20 మంది ఎంపీలు తిరుగుబాటు బావుటా ఎగురవేయడం బెంగాల్ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
లోక్సభలో మొత్తం 28 మంది టీఎంసీ సభ్యులు ఉండగా, అందులో ఏకంగా 20 మంది ఎంపీలు మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ నాయకత్వానికి వ్యతిరేకంగా మారడం పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. ప్రస్తుత పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న అభిషేక్ బెనర్జీని ఆ స్థానం నుండి తొలగించి, ఆయన స్థానంలో కాకోలీ ఘోష్ దస్తీదార్ను నియమించాలని కోరుతూ తిరుగుబాటు ఎంపీల వర్గం ఇప్పటికే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఒక లేఖను కూడా సమర్పించింది. ఈ పరిణామాల నేపథ్యంలో రెబల్ ఎంపీలంతా ఢిల్లీలో క్యాంప్ రాజకీయాలు నడుపుతున్నారు.
అయితే, తాము భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరబోమని ఈ రెబల్ ఎంపీలు స్పష్టం చేశారు. జాతీయ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అవసరమైనప్పుడు కేంద్రంలోని ఎన్డీఏ (NDA) కూటమికి అంశాల వారీగా మద్దతు ఇస్తామని వారు వెల్లడించారు. మరోవైపు అభిషేక్ బెనర్జీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వంటి విపక్ష నాయకులను కలుస్తూ మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తుండగా, మమతా బెనర్జీ వర్గం మాత్రం తిరుగుబాటుదారుల సంఖ్యాబలంపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది.









