హర్మూజ్ జలసంధిలోని ఒమన్ తీరం వెంబడి గస్తీ తిరుగుతున్న అమెరికా సైనిక హెలికాప్టర్ AH-64 అపాచీపై ఇరాన్ దళాలు దాడి చేసి కూల్చివేశాయి. ఈ ప్రమాదకరమైన ఘటనలో హెలికాప్టర్‌లోని పైలట్, కో-పైలట్‌లను అమెరికా సైన్యం ఒక అత్యాధునిక డ్రోన్ బోట్ సహాయంతో క్షేమంగా రక్షించింది. సముద్రంలో చిక్కుకున్న సిబ్బందిని రక్షించడానికి అమెరికా నేవీ ఇలాంటి స్వయంప్రతిపత్తి (అటానమస్) కలిగిన ఉపరితల నౌకను ఉపయోగించడం ఇదే మొట్టమొదటిసారి. కాగా, ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన ఆ డ్రోన్ బోటును అభివృద్ధి చేసిన సంస్థ వెనుక ఒక భారత సంతతి ఇంజినీర్ ఉండటం విశేషం.
టెక్సాస్‌కు చెందిన ‘సరోనిక్ టెక్నాలజీస్’ అనే రక్షణ సాంకేతిక సంస్థ అభివృద్ధి చేసిన ‘కార్సెయిర్’ అనే డ్రోన్ బోటును ఈ ఆపరేషన్ కోసం ఉపయోగించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో పనిచేసే ఈ బోట్ 24 అడుగుల పొడవు ఉండి, గంటకు 35 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. 1000 పౌండ్ల బరువును మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. ఈ సంస్థను సెప్టెంబర్ 2022లో మాజీ నేవీ సీల్ అధికారి డైనో మావ్రూకాస్‌తో కలిసి భారత సంతతికి చెందిన వైభవ్ ఆల్టెకర్ సహ-వ్యవస్థాపకుడిగా స్థాపించారు. ప్రస్తుతం ఈ సంస్థకు అమెరికా నౌకాదళంతో 392 మిలియన్ డాలర్ల ఉత్పత్తి ఒప్పందం ఉంది.
ఈ సంస్థకు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO)గా వ్యవహరిస్తున్న వైభవ్ ఆల్టెకర్.. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. సరోనిక్ సంస్థలో స్వయంప్రతిపత్తి వ్యవస్థలు, సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్చర్ రూపకల్పనలో ఆయన అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో ప్రముఖ రక్షణ సంస్థ ‘ఆందురిల్’ లో పనిచేసిన ఆయన, రాయల్ ఆస్ట్రేలియన్ నేవీకి చెందిన ‘ఘోస్ట్ షార్క్’ డ్రోన్ జలాంతర్గామి వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు నాయకత్వం వహించారు. అమెరికా రక్షణ శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధునీకరించడంలో వైభవ్ ఆల్టెకర్ తన అపారమైన నైపుణ్యంతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు.









