ఆంధ్రప్రదేశ్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సు ప్రవేశాల ఫలితాలు విడుదలయ్యాయి. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రొవిజనల్ సెలెక్షన్ జాబితాను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఫలితాలలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచడం విశేషం.
ఈ ఏడాది ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కోసం మొత్తం 44,104 దరఖాస్తులు రాగా, వారిలో మెరిట్ ఆధారంగా 4,040 మంది విద్యార్థులను తాత్కాలికంగా ఎంపిక చేసినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. నూజివీడు, ఆర్కే వ్యాలీ (ఇడుపులపాయ), ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ఈ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఎంపికైన వారిలో రికార్డు స్థాయిలో 96.7% మంది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులే ఉండటం గర్వకారణమని, గ్రామీణ ప్రతిభను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఎంపికైన విద్యార్థులందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. అభ్యర్థులు తమ ఎంపిక పత్రాలను (Selection Letters) అధికారిక వెబ్సైట్ rgukt.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ప్రవేశాలకు సంబంధించిన ఏవైనా సందేహాలుంటే, సహాయం కోసం విద్యార్థులు 9552300009 అనే వాట్సాప్ హెల్ప్‌డెస్క్ నంబర్‌ను సంప్రదించవచ్చని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.









