టాలీవుడ్ క్రేజీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఒకవైపు రాజకీయ ప్రముఖులతో విందు, మరోవైపు సొంత ఊరిలో విద్యార్థుల కోసం సేవా కార్యక్రమం.. ఇలా రెండు భిన్నమైన సందర్భాల్లోనూ ఈ జంట కలిసి సందడి చేయడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (ఆర్ఆర్ఆర్) ఇచ్చిన ప్రత్యేక విందుకు వీరిద్దరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ సాయంత్రం వారితో గడిపిన సమయం మరపురానిదంటూ రఘురామకృష్ణరాజు తన ‘ఎక్స్’ ఖాతాలో ఫొటోలను పంచుకోగా, రష్మిక కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ రీ-ట్వీట్ చేసింది.
రాజకీయ ప్రముఖులతో విందు ముగించుకున్న అనంతరం ఈ జంట ఒక మంచి సేవా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. విజయ్ దేవరకొండ తన సొంత జిల్లా అయిన నాగర్ కర్నూలు జిల్లాలోని బల్మూర్ మండలం తుమ్మనపేటలో ‘ది విజయ్ దేవరకొండ ఫౌండేషన్’ తరఫున ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి విజయ్, రష్మిక జంటగా హాజరుకావడం విశేషం. వీరితో పాటు స్థానిక అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మరియు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
ఈ విద్యా సహాయక కార్యక్రమంలో భాగంగా అచ్చంపేట నియోజకవర్గంలోని 45 ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 181 మంది విద్యార్థులకు వారు స్వహస్తాలతో స్కాలర్షిప్ చెక్కులను అందజేశారు. అందులో భాగంగా ఫస్ట్ ర్యాంకు సాధించిన విద్యార్థులకు రూ. 10,000, సెకండ్ ర్యాంకు సాధించిన వారికి రూ. 5,000 చొప్పున ఆర్థిక సాయం అందించి వారిని ఉన్నత చదువుల వైపు ప్రోత్సహించారు. ఇలా ఒకే సమయంలో అటు రాజకీయ ప్రముఖుల విందులోనూ, ఇటు విద్యార్థుల సేవా కార్యక్రమంలోనూ విజయ్, రష్మిక జంటగా కనిపించడం టాలీవుడ్‌తో పాటు సామాజిక మాధ్యమాల్లో సరికొత్త చర్చకు దారితీసింది.









