స్టాన్‌ఫర్డ్‌లో సుందర్ పిచాయ్ ప్రసంగం.. మధ్యలోనే విద్యార్థుల వాకౌట్

అమెరికాలోని ప్రముఖ స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేషన్ వేడుకలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తున్న సమయంలో కొందరు విద్యార్థులు అమాంతం తమ సీట్లలోంచి లేచి సభ నుండి బయటకు వెళ్లిపోయారు (వాకౌట్ చేశారు). ఈ ఊహించని ఘటనతో వేడుకలో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొనగా, అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.

యూనివర్శిటీలోని కొన్ని విద్యార్థి సంఘాలు కావాలనే ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయని తెలుస్తోంది. ఇటీవల కాలంలో కొన్ని ప్రధాన గ్లోబల్ టెక్ కంపెనీలు అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో పాటు ఇజ్రాయెల్ రక్షణ దళాల (IDF) లాంటి అంతర్జాతీయ రక్షణ సంస్థలతో కుదుర్చుకున్న వివాదాస్పద ఒప్పందాలే ఈ నిరసనకు ప్రధాన కారణమని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పాలస్తీనా – ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న సుదీర్ఘ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు అంతర్జాతీయ యూనివర్శిటీల్లో టెక్ భాగస్వామ్యాలపై విద్యార్థుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఈ అడ్డంకులు మినహాయిస్తే, స్టాన్‌ఫర్డ్ వేడుకలో సుందర్ పిచాయ్ చేసిన ప్రసంగం మిగిలిన విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత గురించి ఎక్కువగా మాట్లాడకుండా, 1990ల కాలంలో తాను తొలిసారి కాలిఫోర్నియాకు వచ్చినప్పటి తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. “ఈ రోజు మీకు సలహాలు ఇవ్వడానికే వచ్చాను.. కానీ నేను ఏం చెప్పకూడదో కూడా చాలా మంది నాకు ముందే సలహాలు ఇచ్చారు, చివరికి నా ఇంటి పేరు (Pichai) లోని చివరి రెండు అక్షరాలే కదా ఏఐ (AI)” అంటూ ఆయన నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు సదస్సులో నవ్వులు పూయించాయి. 2015 నుండి గూగుల్ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సుందర్ పిచాయ్.. ఇదే స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ పాత విద్యార్థి కావడం ఇక్కడ విశేషం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు