నిజాయితీకి నిదర్శనం. మర్చిపోయిన నగదు బ్యాగును తిరిగి అప్పగించిన మెడికల్ షాపు యజమాని.
భద్రాచలం జూన్ 18
టుడే 9 ప్రతినిధి
ప్రస్తుత సమాజంలో కూడా మానవత్వం, నిజాయితీ ఇంకా బతికే ఉన్నాయని నిరూపించారు *’సాయి సందీప్ వెటర్నరీ మెడికల్స్’ యజమాని హరిబాబు. స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యస్ బి ఐ ) ముందు చెప్పుల వ్యాపారం చేసుకునే ఒక వ్యక్తి మర్చిపోయిన నగదు బ్యాగును, తిరిగి అప్పగించి అందరి మన్ననలు పొందారు.
స్థానిక ఎస్బిఐ బ్యాంకు ముందు చెప్పులు అమ్ముకునే వ్యక్తి, నిన్న రాత్రి 7 గంటల సమయంలో తన సరుకును సర్దుకుని ఇంటికి వెళ్లే క్రమంలో, పొరపాటున నగదు ఉన్న బ్యాగును అక్కడే వదిలేశారు. రాత్రి 9 గంటల సమయంలో తన షాపు మూసి ఇంటికి వెళ్తున్న *’సాయి సందీప్ వెటర్నరీ మెడికల్స్’ యజమాని హరిబాబు, ఆ బ్యాగును గమనించి దానిని జాగ్రత్తగా తన షాపులో భద్రపరిచారు.
అటువైపు, బ్యాగు గల్లంతయిందని గుర్తించిన చెప్పుల వ్యాపారి రాత్రి 12 గంటల తరువాత వచ్చి బ్యాగ్ లేక నిరాశతో వెనుదిరిగారు. ఈరోజు ఉదయం తన బాధను తోటి వ్యాపారులకు చెప్పుకుంటుండగా, విషయాన్ని తెలుసుకున్న హరిబాబు, సదరు వ్యక్తిని పిలిపించి, ఆ బ్యాగును వ్యాపారుల సమక్షంలో తిరిగి అప్పగించారు. ఆ బ్యాగులో తన పిల్లల స్కూలు ఫీజులు, పుస్తకాల కోసం దాచుకున్న సుమారు 35 వేల రూపాయలు యధాతథంగా ఉండటంతో సదరు వ్యాపారి నిరాశ తో ఉదయం నుండి ఏమి తినలేదు అని హరిబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎవరూ చూడని సమయంలో, ఆ నగదును తన సొంతం చేసుకోవాలనే ఆలోచన ఏమాత్రం లేకుండా, బ్యాగ్ యజమానిని వెతికి మరీ అందించిన హరిబాబు నిజాయితీని స్థానిక వ్యాపారులందరూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కెమిస్ట్ అధ్యక్షులు పరిమి సోమశేఖర్ పాల్గొని, హరిబాబును ప్రత్యేకంగా అభినందించారు. ఇటువంటి ఆదర్శవంతమైన వ్యక్తులు ఉండటం మన ప్రాంతానికే గర్వకారణమని వారు పేర్కొన్నారు.









