రూ.లక్షా పదివేల కోట్ల ఆస్తులు కాపాడాం.. మాపై దుష్ప్రచారం ఆపండి: హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్‌లో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ‘హైడ్రా’ (HYDRA) సంస్థపై గత కొన్ని రోజులుగా వ్యతిరేక ప్రచారం జరుగుతోందంటూ ఆ సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథ్ తీవ్రంగా స్పందించారు. కొందరు పనిగట్టుకుని తమ సంస్థను బద్నాం చేయడానికి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన హైడ్రా యాక్షన్ ప్లాన్, ఇప్పటివరకు సాధించిన విజయాలపై పక్కా లెక్కలతో స్పష్టతనిచ్చారు.

హైడ్రా కేవలం కూల్చివేతలకే పరిమితం కాలేదని, ఇప్పటివరకు నగరంలో దాదాపు 600 ఆపరేషన్స్ పూర్తి చేసి, ఆక్రమణదారుల గుప్పిట్లో ఉన్న సుమారు లక్షా పదివేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులను, చెరువులను, పార్కులను కాపాడామని రంగనాథ్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని, తమకు రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎంఐఎం అయినా, అధికార కాంగ్రెస్ అయినా తమకు ఒకటేనని, చట్టం అందరికీ సమానమేనని పేర్కొన్నారు.

అలాగే గుడిసెలు వేసుకున్న వారిలో నిజమైన పేదలను పరిశీలించి, వారికి ప్రభుత్వం తరఫున డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయించిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని మానవీయ కోణంలో స్పష్టం చేశారు. లక్ష మంది ప్రజలకు మంచి చేయాలన్నప్పుడు.. కొంతమంది ఆక్రమణదారులకు చెడు జరగక తప్పదని, ఒకవేళ హైడ్రా వైపు ఏమైనా తప్పు ఉంటే సరిదిద్దుకుంటూ ముందుకెళతాం కానీ, పొలిటికల్ సెటిల్‌మెంట్లకు అడ్డాగా మాత్రం మారబోదని ఆయన తేల్చిచెప్పారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు