తెలంగాణలో కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం లేదంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (ఎస్ఈవో) సుదర్శన్ రెడ్డి చెక్ పెట్టారు. ఓటరు జాబితా ప్రక్షాళన కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR – సర్) ప్రక్రియపై శనివారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి అపోహలు నమ్మవద్దని ఓటర్లకు మరియు యువతకు విజ్ఞప్తి చేశారు.
సుదర్శన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ఈనెల జూన్ 25 నుంచి బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLO) తమ పరిధిలోని ప్రతి ఇంటికీ స్వయంగా రానున్నారు. వారు ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసి వివరాలు సేకరిస్తారు. ఈ ప్రక్రియను పూర్తి చేసి జూలై 25 లోపు నివేదిక సమర్పించాల్సి ఉంటుందని, ఎవరైనా కొత్తగా ఓటు హక్కు పొందాలనుకుంటే అదే ఫారంలో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని ఆయన స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు.
ఓటరు జాబితాలో తప్పులు లేకుండా ఉండేందుకు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో 80 శాతం మ్యాపింగ్ పనులు పూర్తయ్యాయని ఎస్ఈవో తెలిపారు. ఈ మొత్తం డ్రైవ్ పారదర్శకంగా సాగేందుకు డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా నియమించామని, క్షేత్రస్థాయిలో గందరగోళం లేకుండా రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిరంతరం సమావేశాలు ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. అన్ని ప్రక్రియలు ముగించుకుని అక్టోబర్ 1వ తేదీన తెలంగాణ తుది ఓటరు జాబితాను అధికారికంగా ప్రచురిస్తామని సుదర్శన్‌రెడ్డి ప్రకటించారు.








