ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశ రైలు, రహదారి మౌలిక వసతులను బలోపేతం చేసేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం రూ.13,041 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో నాలుగు రైల్వే బహుళ మార్గాల ప్రాజెక్టులు కాగా, మరోటి బిహార్‌లో చేపట్టనున్న రహదారి ప్రాజెక్టు.
రైల్వే ప్రాజెక్టుల్లో గూడూరు-గుమ్మిడిపుండి 3, 4వ లైన్లకు రూ.2,229 కోట్లు, ఖరగ్‌పూర్-భద్రక్ 4వ లైన్‌కు రూ.3,352 కోట్లు, భద్రక్-హరిదాస్పూర్ 4వ లైన్‌కు రూ.1,583 కోట్లు, కటక్-పారాదీప్ 3, 4వ లైన్లకు రూ.2,286 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రైల్వే మార్గాల సామర్థ్యం పెరగడంతో పాటు రద్దీ తగ్గనుంది. సుమారు 1.3 కోట్ల టన్నుల అదనపు సరుకు రవాణా సామర్థ్యం అందుబాటులోకి రానుందని అంచనా.
బిహార్‌లోని ముజఫర్‌పూర్-సీతామర్హి-సోన్బర్సా హైవే నిర్మాణానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నాలుగు లైన్లతో నిర్మించనున్న ఈ రహదారి ప్రాజెక్టుకు రూ.3,591 కోట్లు కేటాయించారు. దీంతో బిహార్‌లోని పలు ప్రాంతాలకు మెరుగైన రహదారి అనుసంధానం ఏర్పడటంతో పాటు నేపాల్ సరిహద్దు వైపు రవాణా సౌకర్యాలు మరింత బలోపేతం కానున్నాయి.









