భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్‌కు ముందే వివాదం.. కారణం ఇదే!

భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య వచ్చే నెల నుంచి జరగనున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ అరుదైన ఘట్టానికి వేదిక కానుంది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా భారత్ తన సొంత గడ్డపైనే ‘అతిథి’ జట్టుగా ఆడనుండగా.. అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ సిరీస్‌కు ఆతిథ్యమివ్వనుంది. అయితే సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ మ్యాచ్‌లు మొదలుకాకముందే వివాదంలో చిక్కుకున్నాయి. కమర్షియల్, టీవీ ప్రొడక్షన్ హక్కులను అఫ్గానిస్థాన్ బోర్డు పాకిస్థాన్‌కు చెందిన ‘ట్రాన్స్‌గ్రూప్’ సంస్థకు అప్పగించడమే ఇందుకు కారణంగా మారింది.

ఆగస్టు 12న సిరీస్ షెడ్యూల్‌ను ప్రకటించిన సందర్భంగా అఫ్గానిస్థాన్ బోర్డు తమ భాగస్వాముల వివరాలను వెల్లడించింది. ‘వాణి’ సంస్థ క్లోథింగ్ పార్ట్‌నర్‌గా, ‘ట్రాన్స్‌గ్రూప్’ గ్లోబల్ మీడియా రైట్స్ సిండికేషన్ పార్ట్‌నర్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపింది. అలాగే ‘TPT360’ మీడియా ప్రొడక్షన్ పార్ట్‌నర్‌గా, భారత్‌లో ప్రసారాల కోసం ‘ఫ్యాన్‌కోడ్’ అధికారిక స్ట్రీమింగ్ పార్ట్‌నర్‌గా ఉండనున్నాయి. అయితే ట్రాన్స్‌గ్రూప్‌కు పాకిస్థాన్ సూపర్ లీగ్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

గత కొన్నేళ్లుగా అఫ్గానిస్థాన్ తమ హోమ్ మ్యాచ్‌లను విదేశీ మైదానాల్లో నిర్వహిస్తోంది. భారత్‌లోని లక్నో, డెహ్రాడూన్, గ్రేటర్ నోయిడాతో పాటు యూఏఈ కూడా అఫ్గానిస్థాన్‌కు హోమ్ గ్రౌండ్స్‌గా వ్యవహరించాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో మ్యాచ్‌లు జరుగుతున్నప్పటికీ అఫ్గానిస్థాన్ ఆతిథ్య జట్టుగా, భారత్ గెస్ట్ టీమ్‌గా ఆడనుంది. ఇదే సమయంలో పాకిస్థాన్‌కు చెందిన సంస్థకు హక్కులు అప్పగించడంతో సిరీస్‌పై ఆసక్తితో పాటు వివాదం కూడా మొదలైంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share