దేవదుర్గలో బంగారం, రాగి అన్వేషణ.. భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

కర్ణాటకలోని దేవదుర్గ గని నుంచి బంగారం, రాగి ఖనిజాలను వెలికితీసి దేశ సంపదను పెంచేందుకు అందరూ కలిసి కృషి చేయాలని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాయచూరు జిల్లా లింగదహళ్లిలో సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టిన కాపర్‌, గోల్డ్‌ మైనింగ్‌ అన్వేషణను ఆయన ప్రారంభించి, పనులను పరిశీలించారు. 136 ఏళ్ల మైనింగ్‌ అనుభవం ఉన్న సింగరేణి దేవదుర్గ బ్లాక్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ హక్కులను దక్కించుకుందని తెలిపారు.

ఈ ప్రాజెక్టులో బంగారం, రాగి నిక్షేపాలు పెద్దఎత్తున లభిస్తే స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ప్రాంత అభివృద్ధి వేగవంతమవుతుందని భట్టి ఆశాభావం వ్యక్తం చేశారు. పనుల పర్యవేక్షణను వేగవంతం చేసేందుకు సింగరేణి ఆధ్వర్యంలో త్వరలో సైట్‌ ఆఫీస్‌, హెలిప్యాడ్‌ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కృష్ణానదికి ఇరువైపులా ఉన్న తెలుగు, కర్ణాటక ప్రజల మధ్య ఉన్న సాంస్కృతిక బంధాన్ని ప్రస్తావిస్తూ స్థానికుల సహకారంతో ప్రాజెక్టును విజయవంతం చేయాలని కోరారు.

సింగరేణి సీఎండీ డాక్టర్‌ బుద్ధప్రకాష్‌ జ్యోతి మాట్లాడుతూ దేవదుర్గలో గతంలో సీఐగా పనిచేసిన తాను ఇప్పుడు సింగరేణి అధినేతగా బంగారం, రాగి నిక్షేపాల అన్వేషణ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమానికి ముందు భట్టి విక్రమార్కకు స్థానిక నాయకులు స్వాగతం పలికారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, లింగదహళ్లిలోని చారిత్రక శ్రీ పరమానంద శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share