డొనాల్డ్ ట్రంప్‌కు కోర్టులో ఎదురుదెబ్బ: 10 శాతం టారిఫ్‌లు చట్టవిరుద్ధం

ఇరాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు న్యాయస్థానంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ ప్రభుత్వం ఇటీవల విధించిన 10 శాతం గ్లోబల్ టారిఫ్‌లను అమెరికా వాణిజ్య కోర్టు (US Trade Court) చట్టవిరుద్ధమని ప్రకటించింది. 1974 వాణిజ్య చట్టాన్ని సాకుగా చూపిస్తూ విధించిన ఈ విస్తృత పన్నులను తాము సమర్థించలేమని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.

ఫిబ్రవరి 24 నుంచి అమలులోకి వచ్చిన ఈ టారిఫ్‌లకు వ్యతిరేకంగా 24 రాష్ట్రాలు, పలు చిన్న వ్యాపార సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. ‘చెల్లింపుల లోటు’ను నిరోధించడానికి దశాబ్దాల నాటి చట్టాన్ని అధ్యక్షుడు దుర్వినియోగం చేశారని అంతర్జాతీయ వాణిజ్య కోర్టు 2-1 మెజారిటీతో తీర్పునిచ్చింది. ఈ ఆదేశాలను ఐదు రోజుల్లోపు అమలు చేయాలని, కోర్టును ఆశ్రయించిన సంబంధిత దిగుమతిదారులకు వారి డబ్బును వెంటనే రీఫండ్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అయితే, ఈ తాజా తీర్పు కేవలం కోర్టును ఆశ్రయించిన పక్షాలకు మాత్రమే వర్తిస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉక్కు, అల్యూమినియం, ఆటోమొబైల్ వంటి రంగాలపై విధించిన సుంకాలు యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించింది. కాగా, వాణిజ్య కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై అమెరికా న్యాయ విభాగం ‘యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్’లో సవాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు