తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత సి. జోసెఫ్ విజయ్ సాధించిన విజయంపై పట్టాళి మక్కల్ కట్చి (పీఎంకే) అధ్యక్షుడు అన్బుమణి రాందాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం, విజయ్ ముఖ్యమంత్రి కావడం వెనుక ప్రజల్లో వచ్చిన మార్పే కారణమని అంగీకరిస్తూనే.. దీనిని ఒక రాజకీయ సునామీగా మాత్రం తాము భావించడం లేదని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకమైన ఏకపక్ష గాలి వీచలేదని అన్బుమణి రాందాస్ గణాంకాలతో సహా వివరించారు. గతంలో 1991, 1996 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను అసలైన రాజకీయ సునామీలుగా చెప్పుకోవచ్చని, ఒకవేళ ఇప్పుడు కూడా అలాంటి ప్రభంజనమే వచ్చి ఉంటే టీవీకే పార్టీ కనీసం 160కి పైగా స్థానాలను కైవసం చేసుకోవాల్సి ఉండేదన్నారు. కానీ ఈ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 108 స్థానాలకే పరిమితమైందని, ఇది మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువేనని గుర్తు చేశారు. అంతేకాకుండా తమిళనాడులోని మొత్తం 38 జిల్లాల్లో దాదాపు ఎనిమిది జిల్లాల పరిధిలో టీవీకే కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందని ఎండగట్టారు.
ఇదే సమయంలో, ఎన్నికల విజయం తర్వాత వివిధ పార్టీల అగ్రనేతలను మర్యాదపూర్వకంగా కలుస్తున్న ముఖ్యమంత్రి విజయ్ శైలిని ఆయన అభినందించారు. సీఎం విజయ్ తనను కలిసినప్పుడు ఇద్దరి మధ్య దాదాపు 30 నిమిషాల పాటు ఏకాంత చర్చ జరిగిందని అన్బుమణి తెలిపారు. ఈ భేటీలో తమిళనాడులో తక్షణమే ‘కులాల వారీగా సర్వే’ నిర్వహించాలని తాను ముఖ్యమంత్రిని కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలన్నా, అన్ని వర్గాలకూ సంక్షేమ ఫలాలు అందాలన్నా ఈ కుల గణన ఎంత అవసరమో తాను స్పష్టంగా వివరించానని పీఎంకే అధినేత పేర్కొన్నారు.









