మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ‘పెద్ది’ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ముంబై వేదికగా విడుదలైన ఈ చిత్ర యాక్షన్ ట్రైలర్‌కు ఇప్పటికే ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ రాగా, సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు చిత్ర యూనిట్ ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగానే మే 23న మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో ఇండియన్ సినిమా హిస్టరీలోనే నిలిచిపోయేలా ఒక మైండ్ బ్లాకింగ్ మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది.
ఈ సినిమా ప్రచారంలో అత్యంత కీలకమైన ఘట్టంగా నిలవబోయే భోపాల్‌లోని బీహెచ్ఈఎల్ (BHEL) గ్రౌండ్స్ వేడుకలో ఆస్కార్ విజేత, మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ స్వయంగా లైవ్ కాన్సర్ట్ ఇవ్వబోతుండటం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రెండు సాంగ్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించగా.. ఈ వేడుకలో సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవబోయే ఒక ‘స్పెషల్ సాంగ్’ను విభిన్నంగా రిలీజ్ చేయనున్నారు. ఈ పాట రెహమాన్ మార్క్ మ్యూజిక్ బ్లాస్ట్‌లా ఉండబోతోందని డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఇప్పటికే హింట్ ఇచ్చారు.
అయితే, ఈ ఒక్క ఈవెంట్ కోసం వృద్ధి సినిమాస్ మరియు మైత్రి అసోసియేట్స్ పెడుతున్న ఖర్చు వివరాలు వింటే ట్రేడ్ వర్గాలు సైతం నోరెళ్లబెడుతున్నాయి. ఈ మ్యూజికల్ జాతరను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించడం కోసం ముంబై నుండి సుమారు రూ. 150 కోట్ల విలువైన అధునాతన సౌండ్, లైటింగ్ మరియు ప్రత్యేక సాంకేతిక పరికరాలను భోపాల్‌కు తరలిస్తున్నారు. కేవలం ఈ కాన్సర్ట్ సెటప్ కోసం తీసుకొస్తున్న పరికరాల అద్దె ఖర్చే రోజుకు దాదాపు రూ. 1 కోటి వరకు ఉంటుందని సమాచారం. బాలీవుడ్ బ్యూటీ జూనియర్ శ్రీదేవి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.









