బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న పొలిటికల్ డ్రామాలో ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బలిపశువు అయ్యాడని తెలంగాణ ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీలు వాడుతున్న భాషా శైలిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కేవలం అధికారం కోసం ప్రతిపక్షాలు ఎంతటి దిగజారుడు రాజకీయాలకైనా తెగిస్తున్నాయని, రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడటం వారి అలవాటుగా మారిందని అద్దంకి దయాకర్ మండిపడ్డారు.
సమాజంలో అలజడులు సృష్టించేలా రైలు పట్టాలు కోయాలని, దాడులకు దిగాలని పిలుపునివ్వడం ముమ్మాటికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నైజమేనని దయాకర్ విమర్శించారు. “కేసీఆర్ తనకు తెలిసిన కుటిల రాజకీయాన్ని కేటీఆర్‌కు నేర్పితే.. కేటీఆర్ అదే విషయాన్ని బాల్క సుమన్‌కు నూరిపోసి ఉసిగొల్పారు” అని సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా తప్పులు చేసి, ఫార్ములా రేస్ నిధుల దుర్వినియోగంపై విచారణను ఎదుర్కొంటూ కూడా.. కోర్టులు, దర్యాప్తు సంస్థల వద్దకు వెళ్లేటప్పుడు ‘జై తెలంగాణ’ అంటూ పొలిటికల్ డ్రామాలు ఆడటం ఒక్క బీఆర్ఎస్ నేతలకే చెల్లిందని దయాకర్ ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులను, ప్రభుత్వ ఉద్యోగులను, అమాయక రైతులలో లేనిపోని భయాలు కల్పించి రెచ్చగొట్టడమే ఏకైక అజెండాగా బీఆర్ఎస్ అగ్రనాయకత్వం పనిచేస్తోందని విప్ ధ్వజమెత్తారు. చట్ట వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఇప్పటికే బాల్క సుమన్ అరెస్ట్ అయిన నేపథ్యంలో.. అతనితో ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేయించిన అసలు సూత్రధారులు, దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరో పోలీస్ అధికారులు సమగ్ర విచారణ జరిపి తేల్చాలని అద్దంకి దయాకర్ గట్టిగా డిమాండ్ చేశారు.









