పుంగనూరులో ఈవీ క్లస్టర్.. ప్రతి 30 కి.మీ.కు ఛార్జింగ్ స్టేషన్: మంత్రి లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్‌ను ఆటోమోటివ్, ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) రంగంలో దేశానికే హబ్‌గా మార్చేందుకు పటిష్టమైన ప్రణాళికలతో ముందుకెళుతున్నామని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన “సుస్థిర ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0” కింద రాష్ట్రంలో విస్తృతమైన ఈవీ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నామని, ఈ ప్రయాణంలో భాగస్వాములు కావాలని కొరియన్ పరిశ్రమలను ఆయన ఆహ్వానించారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్‌, సియోల్‌లో కొరియా ఆటో ఇండస్ట్రీస్ కోఆపరేషన్ ఏజెన్సీ (KAICA) ఛైర్మన్ టేక్-సుంగ్ లీ నేతృత్వంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో ఈవీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ.. చిత్తూరు జిల్లా పుంగనూరులో ప్రత్యేక ఈవీ క్లస్టర్‌ను నెలకొల్పడంతో పాటు గ్రీన్ కారిడార్లలో ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి లోకేశ్‌ ప్రకటించారు. అలాగే, ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) బస్సులను పూర్తిస్థాయిలో విద్యుదీకరించడం, ఈ-మొబిలిటీ నగరాల అభివృద్ధికి ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా, ఈవీ బ్యాటరీలు, మాగ్నెట్‌ల తయారీకి అవసరమైన ముడిసరుకుల లభ్యత కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో ఒక ‘రేర్ ఎర్త్ కారిడార్’ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో ఇప్పటికే కియా మోటార్స్‌తో పాటు అశోక్ లేలాండ్, ఇసుజు, హీరో మోటోకార్ప్, అమరరాజా వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయని, అశోక్ లేలాండ్ సుమారు రూ. 2,500 కోట్ల పెట్టుబడితో ఈ-బస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోందని లోకేశ్‌ గుర్తుచేశారు. కొరియా కంపెనీల కోసం ప్రత్యేకంగా కియా క్లస్టర్ సమీపంలో ఒకటి, శ్రీసిటీ-చిత్తూరు-తిరుపతి కారిడార్‌లో మరొకటి చొప్పున రెండు ఆటో కాంపోనెంట్స్ పార్కులను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ పార్కులలో ప్లగ్-అండ్-ప్లే షెడ్లు, ఉమ్మడి టెస్టింగ్ సౌకర్యాలతో పాటు పూర్తిస్థాయి సపోర్ట్ కోసం ఏపీ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు (APEDB) లో ప్రత్యేక ‘కొరియా డెస్క్’, ఒక ఉమ్మడి వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు లోకేశ్‌ స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు