లోకేశ్ కనగరాజ్ – అల్లు అర్జున్ క్రేజీ ప్రాజెక్ట్‌లో పూజా హెగ్డే.. హ్యాట్రిక్ కాంబినేషన్ రిపీట్ కానుందా?

పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సంచలన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఒక భారీ చిత్రం రూపుదిద్దుకోనుంది. ‘AA23’గా ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో అల్లు అర్జున్‌కు జోడీగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేను పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది.

ఒకవేళ ఈ వార్త నిజమైతే, బన్నీ-పూజాల కాంబినేషన్‌లో ఇది హ్యాట్రిక్ చిత్రం అవుతుంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘దువ్వాడ జగన్నాథం (డీజే)’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించాయి. ముఖ్యంగా ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో పాటు, అందులోని ‘బుట్టబొమ్మ’ సాంగ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హిట్ పెయిర్ మళ్లీ లోకేశ్ సినిమాలో కలిస్తే అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్, దర్శకుడు అట్లీతో కలిసి ‘రాకా’ అనే పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు, దీని తర్వాతే లోకేశ్ సినిమా పట్టాలెక్కనుంది. ఇటీవల లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘కూలీ’ చిత్రంలో పూజా హెగ్డే ‘మోనికా’ అనే ప్రత్యేక గీతంలో మెరవడం కూడా ఈ తాజా ఊహాగానాలకు బలాన్ని చేకూర్చింది. అయితే ఈ హ్యాట్రిక్ కాంబినేషన్‌పై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు