జింబాబ్వేతో టీమిండియా తొలి టీ20: శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీకి అగ్నిపరీక్ష.. తుది జట్టులోకి యువ సంచలనం!

ఇంగ్లండ్ పర్యటనలో ఎదురైన ఘోర పరాజయం తర్వాత భారత క్రికెట్ జట్టు మరొక ద్వైపాక్షిక సిరీస్‌కు సన్నద్ధమైంది. జూలై 23న హరారే వేదికగా జింబాబ్వేతో జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌తో ఈ 3 మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు కెప్టెన్‌గా ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయిన శ్రేయస్ అయ్యర్‌కు ఈ సిరీస్ అత్యంత కీలకంగా మారింది. ఐర్లాండ్‌పై రెండు, ఇంగ్లండ్‌పై నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన శ్రేయస్, ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి విమర్శకులకు గట్టి సమాధానం చెప్పాలనే పట్టుదలతో ఉన్నాడు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టులో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. సీనియర్ వికెట్ కీపర్ సంజూ శామ్‌సన్‌కు విశ్రాంతి ఇవ్వడంతో, యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది. అతడు ఓపెనర్‌గా అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోవడం, శివమ్ దూబే ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతుండటంతో.. చాలా రోజుల తర్వాత విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్‌కు తుది జట్టులో మళ్లీ స్థానం దక్కే ఛాన్స్ కనిపిస్తోంది.

ఇక బౌలింగ్ విభాగానికి వస్తే, పేసర్లుగా ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్‌ల ఎంపిక దాదాపు ఖరారైనట్లే. అయితే, మూడో బౌలర్ స్థానం కోసం జట్టులో తీవ్రమైన పోటీ నెలకొంది. మయాంక్ యాదవ్, హర్ష్ దూబే, రవి బిష్ణోయ్‌లలో ఎవరిని అదృష్టం వరిస్తుందో చూడాలి. భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ సేన ఎలాంటి ప్రదర్శన ఇస్తుందోనని క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు