గోవిందా, కరిష్మా.. తెర వెనుక ఆసక్తికర బంధం ఇదే!

90వ దశకంలో బాలీవుడ్ వెండితెరను ఊపేసిన మోస్ట్ సక్సెస్ ఫుల్ జంటలలో గోవిందా, కరిష్మా కపూర్ జోడీ ఒకటి. వీరిద్దరూ కలిసి అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. అయితే తాజాగా ఒక టాక్ షోలో పాల్గొన్న ఈ సూపర్ హిట్ పెయిర్, తెర వెనుక తమ మధ్య ఉన్న ఆసక్తికరమైన అనుబంధాన్ని మరియు షూటింగ్ నాటి మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. పని కంటే ఎక్కువగా షూటింగ్స్ లో కరిష్మాకు రక్షణగా ఉండటానికే తాను ప్రాధాన్యత ఇచ్చేవాడినని గోవిందా ఈ సందర్భంగా వెల్లడించారు.

కరిష్మా చాలా సింపుల్, అమాయకురాలని, 1940ల నాటి హీరోయిన్ల లాగా నేరుగా షూటింగ్‌కు వచ్చేదని గోవిందా కొనియాడారు. తాను కలిసి పనిచేసిన నటీమణులలో ఆమె అత్యంత నిజాయతీపరురాలని ప్రశంసించారు. గోవిందా మాటలను ధ్రువీకరించిన కరిష్మా, తాను స్కూల్‌లో ఉన్నప్పటి నుంచే ఆయనకు వీరాభిమానినని చెప్పారు. తనకు 12-13 ఏళ్లు ఉన్నప్పుడు ‘గోవిందా నైట్’ షో గురించి పేపర్‌లో చదివి, తల్లిదండ్రులతో గొడవపడి మరీ ఆ షోకి వెళ్లానని, షో పూర్తయిన తర్వాత బ్యాక్‌స్టేజ్‌కి వెళ్లి ఆయన ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నానని ఆనందంగా గుర్తుచేసుకున్నారు.

ఇదే సమయంలో ‘రాజా బాబు’ సినిమా షూటింగ్ నాటి ఒక సరదా సంఘటనను గోవిందా గుర్తుచేసుకున్నారు. ఒక సన్నివేశంలో భాగంగా కరిష్మా వాటర్ ట్యాంక్ పైకి ఎక్కాల్సి వచ్చిందని, అయితే అక్కడి ఎత్తు చూసి ఆమె విపరీతంగా భయపడిపోయిందని తెలిపారు. ఆ భయంలో ఆమె డైలాగులను కూడా వేర్వేరు స్వరాల్లో వణుకుతూ చెప్పిందని ఆయన నవ్వుతూ వెల్లడించారు. కాగా, వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రాజా బాబు’, ‘కూలీ నెం.1’, ‘హీరో నెం.1’, ‘హసీనా మాన్ జాయేగీ’, ‘సాజన్ చలే ససురాల్’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు