ఉస్మానియా ఆసుపత్రిలో కన్నుమూసిన నటి ప్రముఖ సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తీవ్రమైన గుండెపోటు రావడంతోనే ఆమె మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి.
సంగీత, చిత్ర పరిశ్రమకు తీరని లోటు పావలా శ్యామల మృతిపై పవన్ కల్యాణ్ తన సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా స్పందిస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. శ్రీమతి పావలా శ్యామల గారు కన్నుమూశారని తెలిసి ఎంతో చింతించానని ఆయన పేర్కొన్నారు. రంగస్థలంపై అద్భుతమైన ప్రదర్శనలతో ప్రశంసలు అందుకున్న శ్యామల గారు, చిత్ర పరిశ్రమలోనూ ఎన్నో విలక్షణమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు.
రంగస్థలం నుంచి వెండితెర వరకు నాలుగు దశాబ్దాల ప్రస్థానం గుంటూరు జిల్లా అమరావతిలో 1951లో జన్మించిన నేతి శ్యామల (అసలు పేరు), నాటకరంగం నుంచి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1985లో ‘బాబాయ్ అబ్బాయ్’ చిత్రంతో వెండితెరకు పరిచయమై, తన నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో గుర్తింపు పొందిన పాత్రలు పోషించారు. ముఖ్యంగా ఖడ్గం, వర్షం, స్వర్ణకమలం, గోలీమార్, మత్తు వదలరా వంటి చిత్రాల్లో ఆమె పండించిన హాస్యం, నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.









