ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (MAUD) శాఖ ఉత్తర్వులు జారీ చేస్తూ రాష్ట్రంలోని 100 అర్బన్ లోకల్ బాడీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. వీటిలో ఇప్పటికే పాలకవర్గాల గడువు ముగిసిన 87 పురపాలక సంఘాలతో పాటు నవంబర్లో పదవీకాలం ముగియనున్న మరో 13 మున్సిపాలిటీలు ఉన్నాయి.
మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలకు అవసరమైన ముందస్తు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఓటర్ల జాబితాల తయారీ, వార్డుల విభజన, ఇతర ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసి నోటిఫికేషన్ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది. ఎన్నికల్లో బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే రిజర్వేషన్ల ఖరారు సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఉంటుందని పేర్కొంది.
16వ ఆర్థిక సంఘం నుంచి స్థానిక సంస్థలకు అందే గ్రాంట్లను పొందేందుకు ఎన్నికలను నిర్ణీత సమయంలో పూర్తి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు సంబంధిత శాఖలు, అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించింది. ఎన్నికలు పూర్తయి కొత్త పాలకవర్గాలు ఏర్పడితే పట్టణ స్థానిక సంస్థల్లో పరిపాలన మరింత వేగవంతం కానుంది.









