హైదరాబాద్ శివార్లలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న భారీ పాన్ మసాలా, పొగాకు తయారీ కేంద్రాన్ని సెంట్రల్ జీఎస్టీ (CGST) హైదరాబాద్ జోన్ ఇంటెలిజెన్స్ అధికారులు మంగళవారం ఛేదించారు. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని ఓ నిర్జన ప్రాంతంలో పెద్ద టిన్ షెడ్‌లో గుట్టుచప్పుడు కాకుండా ఈ అక్రమ తయారీ యూనిట్‌ను నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
సమాచారం మేరకు అధికారులు తయారీ కేంద్రంపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పాన్ మసాలా, పొగాకు తయారీకి ఉపయోగిస్తున్న భారీ యంత్రాలతో పాటు పెద్ద మొత్తంలో ముడిసరుకు, తయారైన ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అనుమతులు లేకుండా ఈ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
దాడిలో స్వాధీనం చేసుకున్న సరుకు, యంత్రాల విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. అక్రమ తయారీ, పన్ను ఎగవేతకు సంబంధించిన కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ అక్రమ వ్యవహారం వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయంపై అధికారులు మరింత సమాచారం సేకరిస్తున్నారు.









