వైసీపీ సోషల్ మీడియా పోస్టుల వివాదం.. సుప్రీంకోర్టు కీలక సూచన

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పోస్టులను తొలగించడంపై దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అయితే ఈ అంశంపై ముందుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. దీంతో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుని ఏపీ హైకోర్టును ఆశ్రయించాలని వైసీపీ నిర్ణయించింది. జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. వైసీపీ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ వాక్ స్వాతంత్ర్య హక్కును హరిస్తోందని, ప్రధాన ప్రతిపక్షం గొంతును అణిచివేసే ప్రయత్నం జరుగుతోందని వైసీపీ పిటిషన్‌లో పేర్కొంది. తమ అధికారిక ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఖాతాల నుంచి వందలాది పోస్టులను బ్లాక్ చేస్తున్నారని ఆరోపించింది. ఎలాంటి కోర్టు ఆదేశాలు లేకుండానే పోస్టులను తొలగిస్తున్నారని, ఇది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని పేర్కొంది.

సోషల్ మీడియా పోస్టులను బ్లాక్ చేయడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69A లేదా కోర్టు ఆదేశం అవసరమని ‘ష్రేయా సింఘాల్’ తీర్పును వైసీపీ తన పిటిషన్‌లో ప్రస్తావించింది. అయితే ఈ రెండు మార్గాల్లో ఏదీ అనుసరించకుండానే పోస్టులను తొలగిస్తున్నారని పార్టీ ఆరోపించింది. సుప్రీంకోర్టు సూచనతో ఇప్పుడు ఈ అంశంపై ఏపీ హైకోర్టులో వైసీపీ న్యాయపోరాటం కొనసాగించనుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు