సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ మండలం కొత్తూరు (D) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల మైదానంలో లభించిన పవర్ బ్యాంక్ అకస్మాత్తుగా పేలిపోవడంతో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనతో పాఠశాలలో, గ్రామంలో తీవ్ర కలకలం రేగింది.
అందిన వివరాల ప్రకారం.. రాకేష్ అనే విద్యార్థి పాఠశాల గ్రౌండ్లో ఆడుకుంటుండగా అతనికి ఓ పవర్ బ్యాంక్ కనిపించింది. కుతూహలంతో దానిని తీసుకున్న రాకేష్ తన ప్యాంట్ జేబులో పెట్టుకుని ఆడుకోవడం ప్రారంభించాడు. కొద్దిసేపటికే పవర్ బ్యాంక్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది.
పేలుడు ధాటికి మంటలు చెలరేగడంతో రాకేష్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు, స్థానికులు అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ, పవర్ బ్యాంక్ అక్కడికి ఎలా వచ్చిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.









