దసరా పండుగను పురస్కరించుకుని ప్రయాణికులు తమ సొంత ఊళ్లకు సురక్షితంగా, సౌకర్యవంతంగా వెళ్లేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) అత్యంత భారీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు సుమారు 7,000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 9, 10, 16, 17 తేదీల్లో ఊర్లకు వెళ్లేవారి రద్దీ అధికంగా ఉంటుందని అంచనా వేయగా, పండుగ ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణాల కోసం అక్టోబర్ 25, 26 తేదీల్లో ప్రత్యేక సర్వీసులను సిద్ధం చేశారు.
జోన్ల వారీగా కేటాయింపులను పరిశీలిస్తే.. కరీంనగర్ జోన్ పరిధిలో అత్యధికంగా 3,533 బస్సులు (కరీంనగర్ 1,175, నిజామాబాద్ 719, ఖమ్మం 678, వరంగల్ 530, ఆదిలాబాద్ 431) నడవనున్నాయి. హైదరాబాద్ జోన్ నుంచి 2,155 బస్సులు (నల్గొండ 815, మహబూబ్‌నగర్ 645, రంగారెడ్డి 440, మెదక్ 255) మరియు గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధి నుంచి మరో 1,312 ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి ఈ ప్రత్యేక బస్సులకు సవరించిన టికెట్ ధరలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.
ఈ ఏడాది పండుగ ప్రయాణికుల కోసం టీజీఎస్ఆర్టీసీ సరికొత్త వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, టౌన్‌షిప్‌లు, హాస్టళ్లు లేదా కళాశాలల నుంచి కనీసం 30 మంది ప్రయాణికులు ఒక గ్రూప్‌గా ఏర్పడి ముందస్తుగా బుక్ చేసుకుంటే.. ఆర్టీసీ బస్సు నేరుగా వారి నివాసాల వద్దకే వచ్చి పికప్ చేసుకునే సరికొత్త సదుపాయాన్ని కల్పించింది. ప్రైవేట్ ట్రావెల్స్ అధిక చార్జీల దోపిడీకి చెక్ పెడుతూ ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై నగరవాసుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.









