తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి చావుదెబ్బ తగిలింది. రాష్ట్ర పోలీస్ చరిత్రలో నిలిచిపోయేలా ఏకంగా 47 మంది మావోయిస్టులు శనివారం హైదరాబాద్‌లోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. వీరంతా తమ వద్ద ఉన్న 34 అత్యాధునిక ఆయుధాలను పోలీసులకు అప్పగించి జనజీవన స్రవంతిలో కలిశారు. లొంగిపోయిన వారిలో అత్యధికులు పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారని అధికారులు వెల్లడించారు.
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో గ్రేహౌండ్స్ మరియు సీఆర్‌పీఎఫ్ బలగాలు సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ ఈ భారీ లొంగుబాటుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. బలగాల ముమ్మర కూంబింగ్, నిరంతర నిఘా కారణంగా మనుగడ కష్టమవ్వడం, దానికి తోడు సాయుధ పోరాటం పట్ల విరక్తి చెందడంతో వారు ఆయుధాలు విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ పరిణామంతో రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయినట్లేనని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంత పెద్ద సంఖ్యలో మావోలు లొంగిపోయిన ‘చివరి బ్యాచ్’ బహుశా ఇదే కావచ్చునని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హింస ద్వారా ఏ సమస్య పరిష్కారం కాదని, అజ్ఞాతంలో ఉన్న మిగిలిన వారు కూడా ఆయుధాలు వీడి బయటకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి పునరావాసం కల్పిస్తామని, త్వరలోనే వారికి హెల్త్ కార్డులు కూడా పంపిణీ చేస్తామని డీజీపీ భరోసా ఇచ్చారు.









