ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి క్యాచ్ పట్టే ప్రయత్నంలో తలకు తీవ్రంగా గాయపడ్డారు. పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ అదుపుతప్పి వెనక్కి పడిపోవడంతో, ఆయన తల వెనుక భాగం నేలకు బలంగా తగిలింది. దీంతో ఎంగిడి మైదానంలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో క్రీడాకారులు, అభిమానులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.
పంజాబ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ప్రియాన్ష్ ఆర్య కొట్టిన షాట్‌ను అందుకునే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. బంతిని అంచనా వేస్తూ వెనక్కి పరిగెత్తిన ఎంగిడి, నియంత్రణ కోల్పోయి వెల్లకిలా పడిపోయారు. వెంటనే స్పందించిన వైద్య బృందం ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమంగా ఉండటంతో మైదానంలోకి అంబులెన్స్‌ను రప్పించారు. మెడ కదల్చలేని స్థితిలో ఉన్న ఆయనకు నెక్ బ్రేస్ అమర్చి, అత్యవసరంగా కరోల్ బాగ్‌లోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు.
దాదాపు 15 నిమిషాల పాటు మ్యాచ్ నిలిచిపోగా, స్టేడియం మొత్తం నిశ్శబ్దం ఆవరించింది. ఆసుపత్రికి తరలించే సమయానికి ఎంగిడి స్పృహలో లేరని సమాచారం అందడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అత్యవసర పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎంగిడి స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా విప్రాజ్ నిగమ్ జట్టులోకి వచ్చారు. ఈ స్టార్ పేసర్ త్వరగా కోలుకోవాలని క్రికెట్ ప్రపంచం ఆకాంక్షిస్తోంది.









