తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ “తెలంగాణ రాష్ట్ర సేన” (TRS) ప్రకటించడం బీఆర్ఎస్ పార్టీలో ముదిరిన అంతర్గత సంక్షోభానికి నిదర్శనంగా నిలుస్తోంది. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆమె తన తండ్రి స్థాపించిన పాత పార్టీ పేరును తలపించేలా కొత్త పార్టీని ప్రకటించడం గులాబీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా తన సస్పెన్షన్‌కు కారణమైన హరీష్ రావు, సంతోష్ రావులపై ఆమె బహిరంగంగా యుద్ధం ప్రకటించడం, కేసీఆర్‌ను కొందరు వ్యక్తులు బందీగా చేసుకున్నారని ఆరోపించడం పార్టీలో ముదిరిన విభేదాలను బట్టబయలు చేస్తోంది.
కవిత వ్యూహాత్మకంగా తన పార్టీకి ‘టీఆర్ఎస్’ అని పేరు పెట్టడం వెనుక బలమైన రాజకీయ కారణం ఉంది. కేసీఆర్ పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చడం వల్ల తెలంగాణ మూలాలను కోల్పోయారని, తాను తిరిగి ఆ అస్తిత్వాన్ని తెస్తానని ఆమె వాదిస్తున్నారు. ఇది కేవలం వారసత్వ పోరాటమే కాకుండా, పార్టీ ఉనికికి సంబంధించిన పోరాటంగా మారుతోంది. బీఆర్ఎస్‌లో తగిన ప్రాధాన్యత దక్కని అసంతృప్త నేతలు, కేటీఆర్ నాయకత్వాన్ని వ్యతిరేకించే వారు కవిత వైపు మొగ్గు చూపే అవకాశం ఉండటంతో, కేడర్ చీలడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకత్వం ‘ముందు నుయ్యి – వెనుక గొయ్యి’ అన్న చందంగా ఉంది. కవితను తీవ్రంగా విమర్శిస్తే కుటుంబ గొడవలు రచ్చకెక్కి ప్రజల్లో నమ్మకం పోతుందని, అలాగని మౌనంగా ఉంటే పార్టీ ఖాళీ అవుతుందని నేతలు ఆందోళన చెందుతున్నారు. మద్యం కేసులో పార్టీ తనను ఆదుకోలేదని, కేటీఆర్‌ను వారసుడిగా ఖరారు చేయడం పట్ల కవిత గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ వారసత్వ యుద్ధం తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని ఏ తీరాలకు చేరుస్తుందో చూడాలి.









