అమెరికా పాస్‌పోర్ట్‌లపై ట్రంప్ ఫోటో: అగ్రరాజ్యం 250వ వార్షికోత్సవం వేళ వైట్‌హౌస్ సంచలన నిర్ణయం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో చారిత్రాత్మక మరియు వివాదాస్పద నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. అమెరికా స్వాతంత్ర్య ప్రకటన జరిగి 250 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా విడుదల చేయబోయే ప్రత్యేక ఎడిషన్ పాస్‌పోర్ట్‌లలో ట్రంప్ తన అధికారిక ఫోటోను ముద్రించబోతున్నారు. సాధారణంగా ప్రజాస్వామ్య దేశాల్లో అధికారంలో ఉన్న నేతల చిత్రాలు పాస్‌పోర్ట్‌లపై ఉండవు. శతాబ్దాల సంప్రదాయాలను పక్కన పెట్టి మరీ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీసింది.

ఈ ప్రత్యేక పాస్‌పోర్ట్ లోపలి పేజీల్లో ట్రంప్ ఫోటోతో పాటు ఆయన సంతకం బంగారు వర్ణంలో మెరవనుంది. మరో పేజీలో అమెరికా వ్యవస్థాపక పితామహుల చారిత్రక పెయింటింగ్ ఉండబోతున్నట్లు విదేశాంగ శాఖ ధృవీకరించింది. ప్రస్తుతం ఈ ‘లిమిటెడ్ ఎడిషన్’ పాస్‌పోర్ట్‌లు వాషింగ్టన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయని, స్టాక్ ఉన్నంత వరకు అదనపు రుసుము లేకుండానే వీటిని జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే, అమెరికా కరెన్సీ అయిన డాలర్‌పై కూడా త్వరలోనే ట్రంప్ సంతకం కనిపించబోతోందని ట్రెజరీ విభాగం ఇప్పటికే ప్రకటించింది.

ఈ మార్పులపై అమెరికాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మద్దతుదారులు దీనిని దేశ గర్వానికి చిహ్నంగా చూస్తుంటే, విమర్శకులు మాత్రం దీనిని వ్యక్తిగత ప్రచారంగా కొట్టిపారేస్తున్నారు. ఆధునిక ప్రజాస్వామ్య చరిత్రలో క్రియాశీల రాజకీయాల్లో ఉండి, దేశాధ్యక్షుడిగా కొనసాగుతున్న వ్యక్తి ఫోటో పాస్‌పోర్ట్‌పై ఉండటం ఇదే మొదటిసారి. కింగ్ చార్లెస్ III వంటి వారి చిత్రాలు కరెన్సీపై ఉన్నప్పటికీ, వారు రాజకీయాల్లో నేరుగా పాల్గొనరు. మొత్తానికి తన మార్కును ప్రతిచోటా చూపాలన్న ట్రంప్ లక్ష్యం ఈ నిర్ణయంతో స్పష్టమవుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు