ఇరాన్ సహకరించకుంటే మళ్లీ బాంబుదాడులు మొదలవుతాయి: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక

ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తమతో శాంతి ఒప్పందానికి ముందుకు రావాలని, లేనిపక్షంలో మళ్లీ బాంబు దాడులు మొదలవుతాయని ఆయన హెచ్చరించారు. ఇరాన్ సహకరిస్తే ‘ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ’ ముగిసిపోతుందని, తద్వారా హర్మూజ్ జలసంధి అందరికీ అందుబాటులోకి వచ్చి అంతర్జాతీయ వాణిజ్యం ప్రశాంతంగా సాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు.

ఒకవేళ ఇరాన్ మొండివైఖరి ప్రదర్శిస్తే మాత్రం గతంలో కంటే అత్యంత భీకరస్థాయిలో దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ముగించే దిశగా చర్చలు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అణు కార్యక్రమాలపై తాత్కాలిక నిషేధం విధించేందుకు ఇరాన్ మొగ్గు చూపుతోందని, ఇందుకు ప్రతిగా ఇరాన్‌కు చెందిన నిలిపివేసిన నిధులను విడుదల చేసేందుకు అమెరికా అంగీకరించిందన్న ప్రచారం జరుగుతోంది.

హర్మూజ్ జలసంధిలో ఆంక్షల తొలగింపు మరియు అణు చర్చల కోసం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసేందుకు ఇరు దేశాలు ఒక ఒప్పందానికి చేరువవుతున్నట్లు అమెరికా మీడియా వెల్లడించింది. ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనే అవకాశం ఉంది. అయితే, ట్రంప్ మాత్రం ఇరాన్ సహకారంపైనే ఈ ఒప్పందం మనుగడ ఆధారపడి ఉంటుందని, విఫలమైతే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు