మోదీతో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందా? ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. “మీరు అనుకున్నది సాధించాలంటే తనతో కలవాలి” అని మోదీ అనడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన మండిపడ్డారు. దేశంలో ఇతర రాజకీయ పార్టీలు ఉండకూడదనే లక్ష్యంతో మోదీ పనిచేస్తున్నారని, కేవలం తనతో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్నట్లుగా మాట్లాడటం సరికాదని విమర్శించారు. ప్రధాని అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ భవిష్యత్తు కోసం మరియు రాష్ట్రానికి రావలసిన నిధుల కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రధానిని కలిశారని ఎంపీ స్పష్టం చేశారు. గతంలో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఏ విధంగానైతే సహకారం కోరారో, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా అడిగారని గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్ హయాంలో రాష్ట్రాలకు జరిగిన మేలులో ఇప్పుడు సగం కూడా జరగడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణను కూడా కైవసం చేసుకోవాలని బీజేపీ చూస్తోందని ధ్వజమెత్తారు.

ప్రభుత్వ విప్ బీర్ల యాదయ్య కూడా ఈ అంశంపై స్పందిస్తూ తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకవని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని, రేవంత్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి వచ్చినా కాంగ్రెస్‌కు పోటీ ఇవ్వలేవని అన్నారు. దేశంలో ప్రతిపక్ష నేతలు బలంగా ఉండకూడదని ప్రధాని భావిస్తున్నారని, కానీ ప్రజాస్వామ్యంలో ఇలాంటి ధోరణి మంచిది కాదని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు