పశ్చిమాసియాలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ దాడులతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ యుద్ధ వాతావరణం కారణంగా హర్మూజ్ జలసంధి మూసివేతకు గురికావడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా నిలిచిపోయి, భారత్ వంటి దేశాల్లో చమురు సంక్షోభం తలెత్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్లిష్ట సమయంలో రష్యా భారత్‌కు అండగా నిలుస్తూ కీలక ప్రకటన చేసింది. భారత్‌తో ఉన్న చమురు, సహజవాయువు ఒప్పందాలన్నింటినీ ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరుస్తామని రష్యా స్పష్టం చేసింది.
త్వరలోనే న్యూఢిల్లీ పర్యటనకు రానున్న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, భారత్-రష్యా సంబంధాలు కేవలం వ్యాపార పరమైనవి కావని, అవి బలమైన స్నేహంపై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన నాయకుల్లో ఒకరిగా ఆయన అభివర్ణించారు. భారత్‌ను అన్ని రంగాల్లో స్వయంసమృద్ధి గల దేశంగా తీర్చిదిద్దడంలో మోదీ కృషి అమోఘమని ప్రశంసించారు. ఇంధన సరఫరా బాధ్యతలను రష్యా ఎన్నడూ విస్మరించదని, భారత్‌కు చమురు, బొగ్గు సరఫరాలో ఎటువంటి ఆటంకాలు కలగనివ్వబోమని ఆయన భరోసా ఇచ్చారు.
ఇదే క్రమంలో ఇరు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక బంధాన్ని కూడా లావ్రోవ్ గుర్తుచేశారు. భారతీయులు, రష్యన్లు సోదరులు అనేది కేవలం నినాదం మాత్రమే కాదని, అది తమ సంస్కృతిలో ఒక భాగమని ఆయన వ్యాఖ్యానించారు. రష్యాలో భారతీయ సినిమాలు, టెలివిజన్ సిరీస్‌లకు ఉన్న ఆదరణను ఆయన ప్రస్తావించారు. కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం వంటి కీలక ప్రాజెక్టులలో కూడా రష్యా సహకారం కొనసాగుతుందని, ఇరు దేశాల బంధాన్ని బలహీనపరిచేందుకు జరిగే కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ రష్యా ఇచ్చిన ఈ హామీ భారత్‌కు పెద్ద ఊరటనిస్తోంది.









