ఐఏఎస్‌ల పిల్లలకు రిజర్వేషన్ల కోటా ఎందుకు? సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు

దేశంలో రిజర్వేషన్ల అమలు తీరుపై సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) అత్యంత కీలకమైన, సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇతర వెనుకబడిన తరగతులలో (ఓబీసీ) విద్యాపరంగా, ఆర్థికంగా ఉన్నత స్థానాలకు చేరుకున్న ‘క్రిమీలేయర్’ వర్గాల పిల్లలకు రిజర్వేషన్ ప్రయోజనాలను నిరంతరం పొడిగించడంపై న్యాయస్థానం పలు ప్రశ్నలను లేవనెత్తింది. కోటా ద్వారా సామాజిక, ఆర్థిక పురోగతి సాధించి సమాజంలో స్థిరపడిన కుటుంబాలు, కాలక్రమేణా రిజర్వేషన్ వ్యవస్థ నుంచి స్వచ్ఛందంగా వెలుపలికి రావాలని కోర్టు అభిప్రాయపడింది. ఫలాలు అందుకుని ఉన్నత స్థితికి చేరినవారే తరతరాలుగా అదే కోటాను కోరుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఓబీసీ క్రిమీలేయర్ పరిమితులు, రిజర్వేషన్ల మినహాయింపులపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న మాట్లాడుతూ.. ‘‘తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులుగా ఉండి, ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నత స్థానానికి చేరుకున్నప్పుడు వారిలో సామాజిక పురోగతి స్పష్టంగా కనిపిస్తోంది. మరి అలాంటప్పుడు వారి పిల్లలకు ఇంకా రిజర్వేషన్ల కోటా అవసరమా?’’ అని ప్రశ్నించారు. ఇలాంటి సంపన్న వర్గాలను రిజర్వేషన్ల నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వారే తిరిగి కోర్టులో సవాలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉందన్నారు. ప్రయోజనం పొంది స్థిరపడిన తర్వాత కూడా కోటాను ఆశిస్తే, మనం రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి ఎప్పటికీ బయటపడలేమని ఆమె వ్యాఖ్యానించారు.

అన్ని అవకాశాలను ఒకే కుటుంబంలో ఉన్నత వర్గాలే చేజిక్కించుకుంటే, అదే వర్గంలోని అసలైన నిరుపేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. సమాజంలో కేవలం కొందరికే రిజర్వేషన్ల ఫలాలు పరిమితం కాకూడదని, అట్టడుగున ఉన్న వ్యక్తికి కూడా అందాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. కాగా, 1992 నాటి చారిత్రాత్మక ‘ఇంద్ర సాహ్ని’ (మండల్ కమిషన్) కేసు తీర్పు ప్రకారం.. ఓబీసీలకు 27 శాతం కోటాను సమర్థిస్తూనే, వారిలో ‘క్రిమీలేయర్’ (ధనికవర్గం)ను మినహాయించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం రూ. 8 లక్షల వార్షికాదాయ పరిమితితో పాటు రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారు, ఐఏఎస్, ఐపీఎస్ వంటి సీనియర్ అధికారుల పిల్లలను క్రీమీలేయర్‌గా పరిగణించి కోటా నుంచి మినహాయిస్తున్నారు. ఈ నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, ఇతర సంబంధిత వర్గాలకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు