హస్తినకు సీఎం సిద్ధరామయ్య పయనం:
ఇటీవల నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి ఎన్నికల ప్రక్రియ ముగియడంతో కర్ణాటక కాంగ్రెస్‌లోని అంతర్గత అధికార పోరు మళ్లీ మొదటికి వచ్చింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అధిష్ఠానం నుండి అత్యవసర పిలుపు రావడంతో ఆయన తన క్యాబినెట్ సహచరులు, సన్నిహిత శాసనసభ్యులతో కలిసి ఢిల్లీకి పయనమవడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. మంగళవారం ఉదయం 11 గంటలకు హైకమాండ్‌తో తనకు సమావేశం ఉన్నట్లు ధృవీకరించిన సిద్ధరామయ్య.. అక్కడ చర్చించే అంశాల గురించి తనకు ముందే ఏమీ తెలియదని, రాజకీయాల్లో ఊహాగానాలు ఎప్పుడూ ఉంటాయని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
డీకే శివకుమార్‌కు దక్కని పిలుపు:
మరోవైపు, ఈ కీలకమైన ఢిల్లీ భేటీకి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు అధిష్ఠానం నుండి ఎలాంటి ఆహ్వానం అందకపోవడం గమనార్హం. ఈ వదంతులపై డీకే శివకుమార్ స్పందిస్తూ.. హైకమాండ్ పిలిస్తేనే తాను ఢిల్లీకి వెళ్తానని, రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పుపై మాట్లాడటం తన పరిధిలోని పని కాదని వ్యాఖ్యానించారు. అయితే, గత గురువారం నాయకత్వ మార్పుపై మీడియా అడిగిన ప్రశ్నకు “మంచి రోజు వస్తుంది” అని ఆయన సమాధానమివ్వడం, ఇరు నేతల మధ్య ఉన్న పీఠం పోరును పరోక్షంగా సూచిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, ఈ ఏడాది జనవరిలోనే సిద్ధరామయ్య కర్ణాటకకు అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన రికార్డును సృష్టించడం విశేషం.
రెండున్నరేళ్ల ఫార్ములాపై సంక్షోభం:
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయిన సందర్భంగా గత నవంబరులోనే ఈ నాయకత్వ మార్పు సంక్షోభం తొలిసారిగా తెరపైకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత సీఎం పదవి కోసం ఇద్దరు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో.. చెరో రెండున్నరేళ్లు సీఎంగా ఉండాలని, ముందు సిద్ధరామయ్యకు అవకాశం ఇవ్వాలని అధిష్ఠానం ఒప్పందం కుదిర్చినట్లు శివకుమార్ వర్గం గట్టిగా గుర్తు చేస్తోంది. గతంలో బ్రేక్‌ఫాస్ట్ భేటీల ద్వారా ఈ సంక్షోభాన్ని తాత్కాలికంగా నివారించినప్పటికీ.. మే నెలాఖరులో జరిగే ఈ తాజా అధిష్ఠానం సమావేశంలో ‘అన్ని సమస్యలకు’ ఒక శాశ్వత పరిష్కారం వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.









