ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ (DSP) నటుడిగా అరంగేట్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘యల్లమ్మ’ చిత్రంలో ఆయన హీరోగా నటిస్తున్నారు. అయితే, ఒక అగ్ర సంగీత దర్శకుడిగా ఉండి నటన వైపు ఎందుకు అడుగులు వేశారనే దానిపై డీఎస్పీ స్వయంగా స్పందించారు. తాను ఈ సినిమా చేయడానికి అంగీకరించడం వెనుక ఉన్న అసలు కారణాన్ని మంగళవారం వెల్లడించారు.
ఈ మేరకు తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఓ ప్రత్యేక వీడియోను పంచుకుంటూ.. తన తండ్రి స్వగ్రామమైన వేదురుపాకతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. “చిన్నప్పటి నుంచి జానపద కళల పట్ల నాలో ఆసక్తిని నింపిన అద్భుతమైన సంప్రదాయాలు, సంస్కృతి ఇదే. మా ఊరిలో జరిగే ‘అమ్మోరు జాతర’ వేడుకలు నాపై తీవ్ర ప్రభావం చూపాయి. ‘యల్లమ్మ’ సినిమాకు నేను ఎందుకు ఓకే చెప్పానో ఇదే కారణం” అని డీఎస్పీ పోస్ట్‌లో పేర్కొన్నారు. చిన్నప్పుడు తన తండ్రి తమను చెన్నై నుంచి తరచూ ఈ గ్రామానికి తీసుకొచ్చేవారని, ఇక్కడి ప్రకృతి స్వచ్ఛతను, జానపద కళలను, దైవత్వాన్ని ఈ ఊరే తనకు నేర్పిందని వీడియోలో వివరించారు. ఈ బలమైన అనుబంధం కారణంగానే ‘యల్లమ్మ’ కథకు వెంటనే కనెక్ట్ అయినట్లు తెలిపారు.
దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు యెల్దండి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కథా చర్చల కోసం దర్శకుడు వేణు, డీఎస్పీ మధ్య జరిగిన తొలి సమావేశం ఏకంగా 8 గంటల పాటు సాగడం విశేషం. ఈ చిత్రంలో డీఎస్పీ ‘పర్శి’ అనే వైవిధ్యమైన పాత్రలో కనిపించనుండగా, నటనతో పాటు ఈ చిత్రానికి సంగీతాన్ని కూడా ఆయనే అందిస్తున్నారు. సంస్కృతి, జానపద మూలాల నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.









