తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దళపతి జోసెఫ్ విజయ్ (టీవీకే అధినేత) తన మొదటి అధికారిక ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు ఇదే తొలి అధికారిక పర్యటన కావడం గమనార్హం. అయితే, ఈ పర్యటనకు వెళ్లే ముందే పొరుగు రాష్ట్రమైన కర్ణాటకతో ఉన్న సుదీర్ఘ అంతర్రాష్ట్ర జల వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం విజయ్ ఒక కీలకమైన లేఖ రాశారు. కర్ణాటక ప్రభుత్వం కావేరీ నదిపై ప్రతిపాదించిన ‘మేకెదాటు డ్యామ్’ నిర్మాణ ప్రయత్నాలను తక్షణమే అడ్డుకోవాలని ఆ లేఖలో ప్రధానిని కోరారు.
రామనగర జిల్లాలోని కనకపుర సమీపంలో ఉన్న మేకెదాటు వద్ద ఒక ‘బ్యాలెన్సింగ్ రిజర్వాయర్’ నిర్మించేందుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను (DPR) త్వరలోనే కేంద్రానికి సమర్పించి, ఆమోదం రాగానే శంకుస్థాపన చేస్తామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇటీవల ప్రకటించారు. దీనిపై తమిళనాడు సీఎం విజయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దిగువన ఉన్న భాగస్వామ్య రాష్ట్రాల అనుమతి లేకుండా ఎలాంటి ఆనకట్టలు లేదా రిజర్వాయర్లు నిర్మించకూడదన్న 2018 సుప్రీంకోర్టు తీర్పునకు, కావేరీ ట్రైబ్యునల్ ఆదేశాలకు కర్ణాటక చర్యలు పూర్తిగా విరుద్ధమని విజయ్ తన లేఖలో ప్రధానికి వివరించారు.
బుధవారం నుంచి మూడు రోజుల పాటు సాగనున్న ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి విజయ్.. తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు సీనియర్ అధికారుల బృందంతో కలిసి ప్రధాని మోదీని, పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ పర్యటనలో కావేరీ జల వివాదంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన కీలకమైన నిధులు, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అంతర్రాష్ట్ర అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో విజయ్ నేరుగా చర్చించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పొరుగు రాష్ట్రాల ప్రాజెక్టులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన విజయ్, ఇప్పుడు నేరుగా ప్రధానికి లేఖ రాయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.









