ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ‘ఇంట్యూషన్ ఫెస్ట్’.. అదరగొట్టిన 7వేలమంది పిల్లలు..

బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ‘ది ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన ‘ఇంట్యూషన్ ఫెస్ట్’ (Intuition Fest) మానవ సామర్థ్యాల అద్భుత ప్రదర్శనకు వేదికగా నిలిచింది. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి ఏకంగా 11,000 మందికి పైగా పిల్లలు, తల్లిదండ్రులు హాజరయ్యారు. ఒకే చోట చేరిన ఈ వేలాది మంది ధ్యానం, వినోదంతో పాటు తమ అంతర్గత ప్రతిభను అపూర్వ స్థాయిలో ఆవిష్కరించారు. ఈ ఉత్సవంలో పాల్గొన్న సుమారు 7,000 మంది పిల్లలతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ప్రత్యేకంగా మాట్లాడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. హాజరైన వారిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్న 50 మంది మేధావులైన పిల్లలు కూడా ఉండటం విశేషం.

ఈ వేడుకల్లో భాగంగా పిల్లలు కళ్లకు గంతలు కట్టుకుని పుస్తకాలు చదవడం, దూరం నుంచి అక్షరాలను గుర్తించడం, రంగులు వేయడం మరియు ప్రత్యేక జ్ఞాపకశక్తి ఆధారిత ఆటలలో పాల్గొని వీక్షకులను ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా, 50 మంది పిల్లలు కళ్లకు పూర్తిగా గంతలు కట్టుకుని ఆశ్రమంలో సైకిల్ తొక్కి తమ ఏకాగ్రతను నిరూపించుకున్నారు. స్పూన్‌లను వంచడం, తాకకుండానే టేబుల్ ఫ్యాన్‌ను తిప్పడం వంటి పనులను కూడా పిల్లలు ప్రదర్శించారు. డిజిటల్ యుగంలో యువత ఒత్తిడి, ఆందోళనలతో దృష్టి మరలుతున్న తరుణంలో, ‘ఇంట్యూషన్ ప్రాసెస్’ ద్వారా ఏకాగ్రత, భావోద్వేగ సమతుల్యత మరియు సృజనాత్మకతను ఎలా పెంపొందించుకోవచ్చో ఈ ఫెస్ట్ నిరూపించిందని, తమ పిల్లల్లో స్పష్టమైన సానుకూల మార్పులు వచ్చాయని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ అద్భుత ప్రదర్శనపై గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ మాట్లాడుతూ.. ప్రస్తుత కృత్రిమ మేధస్సు (AI) యుగంలో, పిల్లల్లో పరిపూర్ణ మేధస్సును (Absolute Intelligence) పెంపొందించడం ఎంతో అవసరమన్నారు. ప్రపంచం భౌతిక సాంకేతికతలో ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ, అంతర్గత చైతన్య సాంకేతికతను (Technology of Consciousness) కోల్పోయామని, ఇప్పుడు మన ప్రయాణం దాన్ని తిరిగి సాధించే దిశగా సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌తో పాటు బాలీవుడ్ ప్రముఖ దర్శకులు రాజ్‌కుమార్ హిరానీ, సాజిద్ నడియాద్వాలా, నటులు విక్రాంత్ మాస్సే, సునీల్ గ్రోవర్, వినీత్ కుమార్ సింగ్ మరియు ప్రముఖ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ వంటి ఎందరో ప్రముఖులు పాల్గొని పిల్లల అసాధారణ ప్రతిభను చూసి అభినందించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు