ఆధునిక పోకడల వల్ల మారుతున్న జీవనశైలిని క్రమబద్ధీకరించేందుకు, తమ సాంప్రదాయ విలువలను కాపాడుకునేందుకు గిరిజన సమాజం ఒక విప్లవాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. రాజస్థాన్‌లోని డూంగర్‌పుర్ జిల్లా సరోదా వేదికగా జరిగిన ‘రాజస్థాన్ ఆదివాసీ మహా సమితి’ వ్యవస్థాపక దినోత్సవ ముగింపు వేడుకలు ఈ చారిత్రాత్మక సామాజిక సంస్కరణలకు నాంది పలికాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా తమ యువతను రక్షించుకునేందుకు, సమాజంలో పెరుగుతున్న దుబారా ఖర్చులను అరికట్టేందుకు గిరిజన పెద్దలు తీసుకున్న ఈ సంచలన తీర్మానాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సామాజిక వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.
ఈ చారిత్రాత్మక మహాసభకు రాజస్థాన్‌తో పాటు పొరుగు రాష్ట్రాలైన గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి కూడా వేలాది సంఖ్యలో గిరిజన ప్రజలు తరలివచ్చారు. వారితో పాటు పలువురు సాధువులు, ప్రముఖ ఆధ్యాత్మిక నేతలు సైతం హాజరై ఈ సంస్కరణలకు పూర్తి మద్దతు ప్రకటించారు. సమితి తీసుకున్న తీర్మానాల్లో ప్రధానంగా.. సాంకేతికతకు బానిసలై మైనర్లు తమ భవిష్యత్తును పాడుచేసుకోకుండా ఉండేందుకు 18 ఏళ్లలోపు పిల్లలకు మొబైల్ ఫోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. అలాగే తక్కువ వయసు ఉన్న పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, ముఖ్యంగా గిరిజన యువత బైక్ రేసులకు పాల్పడి ప్రాణాలు కోల్పోకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
వివాహాల పేరుతో గిరిజన కుటుంబాలు అప్పులపాలు కాకుండా చూసేందుకు పెళ్లిళ్లలో బంగారం ఇచ్చిపుచ్చుకునే సంస్కృతికి పూర్తిగా స్వస్తి పలకాలని సమితి స్పష్టం చేసింది. గిరిజన సాంప్రదాయాన్ని గౌరవిస్తూ పెళ్లిళ్లలో కేవలం వెండి ఆభరణాలను మాత్రమే వాడాలని, డీజే సౌండ్ సిస్టమ్స్ వంటి ఆడంబరాలను పూర్తిగా బంద్ చేయాలని నిబంధనలు విధించారు. వీటితో పాటు గిరిజన తెగలకు చెందిన వారంతా సంపూర్ణ మద్యనిషేధాన్ని పాటించాలంటూ సభాముఖంగా ప్రతిజ్ఞ చేయించారు. కేవలం ఆంక్షలు పెట్టడమే కాకుండా, వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న గిరిజన విద్యార్థులను, క్రీడాకారులను ఈ వేదికపై ఘనంగా సత్కరించి అవార్డులు అందజేశారు.









