కర్ణాటక రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. గత మూడు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో అగ్రనేతగా వెలుగొందుతున్న సిద్ధరామయ్య తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం తన క్యాబినెట్ సహచరులు, మద్దతుదారులతో కలిసి గవర్నర్ అధికారిక నివాసమైన లోక్ భవన్‌కు చేరుకున్న ఆయన, తన రాజీనామా లేఖను సమర్పించారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రస్తుతం నగరంలో అందుబాటులో లేనందున, సిద్ధరామయ్య తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ ప్రత్యేక కార్యదర్శికి అందజేశారు. దీంతో కర్ణాటక కాంగ్రెస్‌లో సిద్ధరామయ్య మూడేళ్ల పాలనా శకం ముగిసినట్లయింది.
రాజీనామా సమర్పించిన అనంతరం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తనకు కల్పించిన ఈ మహోన్నత అవకాశానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. మూడేళ్ల పాటు తన ప్రభుత్వానికి, పాలనకు సహకరించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఇరు వర్గాల మధ్య జరిగిన పవర్ షేరింగ్ (అధికార పంపిణీ) ఒప్పందాన్ని గౌరవిస్తూనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పరోక్షంగా సూచించారు.
సిద్ధరామయ్య రాజీనామాతో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం పూర్తిగా సుగమమైంది. అంతకుముందు ఉదయం జరిగిన పార్టీ అంతర్గత బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లోనే సిద్ధరామయ్య స్వయంగా ఈ విషయాన్ని తన సహచరులకు వెల్లడించగా, డీకే శివకుమార్ ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం విశేషం. కాగా, సిద్ధరామయ్యను జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ ఆయనకు రాజ్యసభ సీటుతో పాటు ఏఐసీసీలో కీలక పదవిని ఆఫర్ చేయాలని హైకమాండ్ యోచిస్తోంది. మే 29 సాయంత్రం జరగబోయే కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) సమావేశంలో డీకే శివకుమార్‌ను నూతన నేతగా అధికారికంగా ఎన్నుకోనుండగా, మరో రెండు రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.









