పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుసగా గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీకి చెందిన కీలక నేతలు ఒకరి తర్వాత ఒకరుగా గుడ్ బై చెప్తుండటంతో అక్కడ రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. నిన్ననే సీనియర్ నాయకురాలు కకోలీ దస్తీదార్ ఘోష్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అన్ని పదవులకు రాజీనామా చేయగా.. ఆ మరుసటి రోజే మాజీ రాజ్యసభ ఎంపీ, సీనియర్ నేత డాక్టర్ శంతను సేన్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తూ మమతకు గట్టి షాకిచ్చారు.
తన రాజీనామాకు గల కారణాలను శంతను సేన్ బహిరంగంగానే వెల్లడించారు. 2024లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ హత్యాచార ఉదంతం, అలాగే గత కొంతకాలంగా పార్టీపై వస్తున్న నిరంతర అవినీతి ఆరోపణల వల్ల తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కొనసాగుతూ, పార్టీని సమర్థించుకుంటూ మాట్లాడే స్థితిలో తన మనస్సాక్షి లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు.
వివిధ సమయాల్లో తానే స్వయంగా పార్టీ తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలను బహిరంగంగానే ప్రశ్నించానని, అందువల్లే ప్రజలు తనను ఎల్లప్పుడూ గౌరవించారని శంతను సేన్ గుర్తుచేశారు. ఆర్జీకర్ కేసు దర్యాప్తులో వైఫల్యం, రాష్ట్రంలో నిరుద్యోగం, అవినీతి వంటి ప్రధాన అంశాల వల్లే ప్రజలు ఎన్నికల్లో తమకు గుణపాఠం చెప్పి ఓడించారని ఆయన విశ్లేషించారు. ఎన్నికల ఓటమి అనంతరం బెంగాల్ అధికార పార్టీలో అంతర్గత విబేధాలు ఈ రాజీనామాలతో ఒక్కసారిగా రోడ్డున పడ్డట్లయింది.









