శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టాలి: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గట్టి డిమాండ్!

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 103వ జయంతి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన డిమాండ్ తెరపైకి వచ్చింది. హైదరాబాద్‌ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) ఎన్టీఆర్ పేరు పెట్టాలని కూకట్‌పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (KPHB) పరిధిలోని వసంత్ నగర్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాడు కాంగ్రెస్ పార్టీ సాగించిన అరాచకాలను తట్టుకోలేక, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్ కేవలం 9 నెలల్లోనే పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చారని గుర్తుచేశారు. అలాంటి మహోన్నత నాయకుడి ఆనవాళ్లను తుడిచేసేందుకు ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ కుట్ర పూరితంగా ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు, రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి చారిత్రాత్మక పథకాలు నేటికీ అనేక రాజకీయ పార్టీలకు దిక్సూచిగా నిలిచాయని కొనియాడారు.

తాను రాజకీయాల్లోకి రావడానికి ఎన్టీఆరే ప్రధాన స్ఫూర్తి అని, తనకు ఓటు హక్కు వచ్చిన తర్వాత తొలి ఓటును కూడా టీడీపీకే వేశానని ఎమ్మెల్యే కృష్ణారావు భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టాలనే డిమాండ్‌తో పాటు స్థానిక సమస్యలను కూడా ఆయన ప్రస్తావించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేపీహెచ్‌బీలోని మూడు ఎకరాల స్థలంలో ఎన్టీఆర్ పేరు మీద ఒక ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణాన్ని ప్రారంభించామని తెలిపారు. నిధులు కేటాయించి ఆ ఎన్టీఆర్ స్కూల్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన పూర్తి బాధ్యత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఉందని ఆయన స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు