రీజినల్‌ రింగ్‌ రైలు సర్వే పూర్తి: 174.50 కిలోమీటర్ల మేర ఉత్తర భాగం, 7657 ఎకరాల భూసేకరణకు రూ.7 వేల కోట్లు!

హైదరాబాద్‌ మహానగర చుట్టుపక్కల ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన ‘హైదరాబాద్‌ రీజినల్‌ రింగ్‌ రైలు’ (RRR) ప్రాజెక్టులో ఒక కీలక అడుగు పడింది. ఈ ప్రతిపాదిత రైల్వే లైన్‌కు సంబంధించిన ‘లైడార్’ (LiDAR) సాంకేతిక సర్వే విజయవంతంగా పూర్తయింది. ఈ సర్వే నివేదిక ప్రకారం ప్రాజెక్టు తొలి దశలో నిర్మించే ఉత్తర భాగం మొత్తం 174.50 కిలోమీటర్ల మేర విస్తరించనుంది. లైడార్ సర్వే ముగియడంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన డీటైయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (DPR)ను సిద్ధం చేయడంపై పూర్తి దృష్టి సారించారు.

ఈ సర్వే ఆధారంగా రీజినల్ రింగ్ రైలు ఉత్తర భాగం నిర్మాణానికి భారీగా భూసేకరణ చేపట్టాల్సి ఉంటుందని రైల్వే అధికారులు అంచనా వేశారు. ఈ మార్గం కోసం సుమారు 7,657 ఎకరాల భూమిని సేకరించాలని రైల్వే శాఖ తెలంగాణ ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం అందించింది. ఈ భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయడానికి దాదాపు రూ.6,900 కోట్ల (సుమారు రూ.7 వేల కోట్లు) భారీ వ్యయం కానుండగా, ఆ మొత్తం ఖర్చును పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. ఈ ఉత్తర భాగానికి సంబంధించిన డీపీఆర్ తయారీకి ఈ మే నెలాఖరు వరకు మాత్రమే గడువు ఉండటంతో అధికారులు పనులను వేగవంతం చేశారు.

గతంలో కేంద్ర ప్రభుత్వం 2023 జూన్ 21న ఈ ప్రాజెక్టు సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, మొదట ప్రతిపాదించిన రైల్వే ఎలైన్‌మెంట్‌ వల్ల రీజినల్ రింగ్ రోడ్డు (RRR) మరియు రింగ్ రైలు ప్రాజెక్టులకు వేర్వేరుగా రెండు సార్లు భూసేకరణ చేయడం కష్టమవుతుందని రేవంత్ రెడ్డి సర్కార్ భావించింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి, రీజినల్ రింగ్ రోడ్డుకు ఆనుకునే ఈ రింగ్ రైలు ఎలైన్‌మెంట్‌ను కూడా మార్చాలని కోరడంతో పాత ప్లాన్‌లో మార్పులు చేశారు. సవరించిన నివేదిక ప్రకారం.. సంగారెడ్డి పక్కనే ఉన్న గిర్మాపూర్ నుంచి చౌటుప్పల్ సమీపంలోని తంగడపల్లి వరకు మాసాయిపేట, అప్పాయిపల్లి, రాయగిరి రైల్వేస్టేషన్ ప్రాంతాల మీదుగా ఈ ఉత్తర భాగం సాగనుంది. ఇక రెండో దశలో చేపట్టబోయే దక్షిణ భాగం డీపీఆర్ కోసం కేంద్రం అనుమతి రాగానే సర్వే ప్రారంభం కానుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు